మనీ లాండరింగ్ లో లాలూ స్నేహితుని పేరు..

నవతెలంగాణ – హైదరాబాద్: బీహార్‌లో ఇసుక అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ వ్యవహారంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సన్నిహితుడు, పార్టీ నేత సుభాశ్‌ యాదవ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డెరెక్టరేట్‌ శనివారం రాత్రి అరెస్టు చేసింది. వివరాల్లోకి వెళితే..బ్రాడ్సన్స్ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సుభాశ్‌ యాదవ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ- చలానాలను ఉపయోగించకుండా ఇసుక అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారంటూ కంపెనీతో సహా అతడిపై 20కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. కంపెనీ చేపట్టిన ఇసుక తవ్వకాలు పర్యావరణ నిబంధలనలకు విరుద్ధమని అందులో పేర్కొంది. సిండికేట్‌లతో ఈ దందాను నడిపిస్తున్నారని.. దీనిలో సుభాశ్‌ కీలక సూత్రధారిగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి.వీటి ఆధారంగా పట్నా సమీపంలోని దనపుర్‌లో ఉన్న సుభాశ్‌ నివాసం సహా ఆరు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. 14 గంటల పాటు జరిపిన సోదాల్లో రూ. 2 కోట్లకు పైగా డబ్బుతో పాటు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడైన సుభాశ్‌ను అరెస్టు చేశారు. ఇసుక అక్రమ విక్రయాల ద్వారా రూ. 161 కోట్ల కుంభకోణం జరిగినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలోనే ఇటీవల శాసన మండలి సభ్యుడు రాధా చరణ్‌ సాహ్‌, అతడి కుమారుడు అరెస్టు అయ్యారు.

Spread the love