రేపు బీహార్‌ అసెంబ్లీలో నితీశ్‌ సర్కారుకు బలపరీక్ష..

నవతెలంగాణ – బీహర్: బీహార్ అసెంబ్లీలో సోమవారం జేడీయూ చీఫ్‌ నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీఏ  సర్కారు బలపరీక్ష ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా గయాలోని మహాబోధి రిసార్ట్‌లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ బయటికి వచ్చారు. ప్రత్యేక బస్సులో పట్నాకు బయలుదేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన జేడీయూ కేవలం 43 స్థానాలనే గెలుచుకుంది. బీజేపీ దాని ఇతర మిత్రపక్షాలు 82 స్థానాల్లో విజయం సాధించాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ దాటడంతో నితీశ్‌కుమార్‌ సీఎంగా ఎన్డీఏ సర్కారును ఏర్పాటు చేసింది. అయితే ఆ తర్వాత నితీశ్‌ బీజేపీతో విభేదించి ఆర్జేడీతో కలిసి మరోసారి సీఎంగా మహాకూటమి సర్కారును ఏర్పాటు చేశారు. తాజాగా ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని మళ్లీ బీజేపీ పంచన చేరారు. మళ్లీ ఎన్డీఏ కూటమి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్‌ సోమవారం బలపరీక్ష ఎదుర్కోబోతున్నారు. మొత్తం 243 స్థానాలున్న బీహార్‌ అసెంబ్లీలో ప్రస్తుతం ఆర్జేడీ 75, కాంగ్రెస్‌ 19, సీపీఐ (ఎంఎల్‌) 12 తో కలిపి మహాకూటమి బలం 110గా ఉన్నది. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది సభ్యుల బలం అవసరం. ఎన్డీఏ కూటమికి బీజేపీ 74, జేడీయూ 43తో కలిపి 125 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.

Spread the love