అపాయింట్‌మెంట్‌ లెటర్‌లను పంపిణీ చేసిన ప్రధాని

నవతెలంగాణ- న్యూఢిల్లీ : దేశంలోని యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు రాష్ట్రీయ రోజ్‌గార్‌ మేళాను ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం ప్రధాని మోడీ 51 వేల అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ను పంపిణీ చేశారు. ప్రభుత్వ సంస్థలు, శాఖల్లో ఉద్యోగాల కోసం 51 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా మోడీ చెప్పారు. మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్రీయ రోజ్‌గార్‌ యోజన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఆటో మొబైల్‌, ఫార్మా రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రెండు పరిశ్రమల ద్వారా రాబోయే రోజుల్లో యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం రూ. 20 లక్షల కోట్లకు పైగా దోహదపడనుంది. ఈ రంగం ద్వారా యువతకు 13-14 కోట్ల కొత్త ఉద్యోగావకాశాలు కల్పించవచ్చు. ఈ దశాబ్దంలోనే ప్రపంచంలోని మూడు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటిగా అవతరించనుంది. నేను ఏదైనా హామీని ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చేందుకు బాధ్యతగా వ్యవహరిస్తాను’ అని మోడీ అన్నారు.

Spread the love