ప్రభుత్వ, విద్యాశాఖ ఆకస్మిక నిర్ణయాలు సరికాదు

– టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్
నవతెలంగాణ పెద్దవంగర: ఐచ్ఛిక, సాధారణ, విపత్కర సెలవులకు సంబంధించి ప్రభుత్వం, విద్యాశాఖ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు సరికాదని టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ తీసుకుంటున్న నిర్ణయాలతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను సైతం గందరగోళానికి గురి చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. వాయిదా వేసుకున్న టీచర్ల ఉన్నతి శిక్షణ సైతం అప్పటికప్పుడు కొనసాగించడం ఏంటని ప్రశ్నించారు?
        ఈ అనాలోచిత నిర్ణయం వల్ల సూర్యాపేట జిల్లాలో సమయానికి పాఠశాలకు వెళ్లాలని ఆతృతలో రోడ్డు ప్రమాదానికి గురైన భార్యాభర్తల్లో ఒకరు మృతి చెందారని తెలిపారు. ఈ ఘటన యావత్ ఉపాధ్యాయ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ సంఘటన పట్ల టీపీటీఎఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తుందన్నారు. ఐచ్ఛిక సెలవు రద్దు నిర్ణయం ముందుగానే ప్రకటిస్తే ఇంతటి ఘోరం జరిగేది కాదని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ స్పందించి ముందస్తు సెలవుల విషయంలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం విద్యా సంవత్సరాన్ని కొనసాగించాలని, మార్పులు అనివార్యమైతే ఆకస్మికంగా కాకుండా, ముందస్తు నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Spread the love