సీఎం, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు
5న రాష్ట్రవ్యాప్త నిరసనలు వాయిదా : ఉద్యోగ జేఏసీ చైర్మెన్ జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న నమ్మకం, విశ్వాసముందని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రకటించారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఈనెల ఐదున తలపెట్టిన రాష్ట్రవ్యాప్త నిరసనలను వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని టీఎన్జీవో భవన్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ నివేదికను వెంటనే సమర్పించాలని ఆ కమిటీ చైర్మెన్ శివశంకర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని అన్నారు. ఆ నివేదిక ఆధారంగా ఉద్యోగ జేఏసీ నేతలతో చర్చించి వేతన పెరుగుదల (ఫిట్‌మెంట్)ను ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు.
అందులోనే ఐదు డీఏ బకాయిలను కలుపుతారని వివరించారు. జూన్ ఒకటిలోగా రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ కొత్త ఆరోగ్య భద్రత కార్డులను అందజేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తున్న అన్ని వర్గాల వారికి దశల వారీగా వర్తింపజేస్తారని అన్నారు. పెన్షనర్ల బకాయిలకు సంబంధించి వంద రోజుల్లో రూ.ఆరు వేల కోట్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. ఇతర బకాయిల కోసం నెలకు రూ.వెయ్యి కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. సీపీఎస్‌పైన విధాన నిర్ణయం తీసుకుంటుందనీ, 2004, సెప్టెంబర్ ఒకటి కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకమైన ఉద్యోగులకు వెంటనే పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్) అమలయ్యేలా చూస్తామన్నారని వివరించారు. ఉపముఖ్యమంత్రి భట్టితో కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారని అన్నారు. 63 డిమాండ్లలో 26 పూర్తిగా లేదా పాక్షికంగా నెరవేరాయని వివరించారు.
మిగిలిన 37 డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చెప్పారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని రెండు నెలలకోసారి సమావేశాన్ని నిర్వహించాలని సీఎస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని గుర్తు చేశారు. ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ముందు ఒక ప్రతిపాదన ఉంచామని అన్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి ఆగస్టు 31 వరకు ఏర్పడే ఖాళీలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని డీపీసీ ఒకేసారి ఆమోదించేలా చూడాలన్నారు. దానివల్ల ఖాళీ ఏర్పడిన ప్రతిసారి డీపీసీ వేయాల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేశారు. అర్హులైన ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు లభిస్తాయని వివరించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ఒకవేళ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా ఆలస్యం చేస్తే ఉద్యమ కార్యాచరణకు పూనుకుంటామని స్పష్టం చేశారు.
అసమ్మతి వ్యక్తం చేస్తున్న ఉద్యోగుల వెనుక కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని అన్నారు. ఆదాయం వచ్చే శాఖల్లోని ఉద్యోగులతో తాము చర్చించి ఆదాయం పెంచే మార్గాలను అన్వేషిస్తామని చెప్పారు. ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు సమర్పిస్తామని వివరించారు. ఉద్యోగ జేఏసీ కోచైర్మెన్ పి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, ప్రభుత్వానికి దూరం పెరిగితే సంతోషించే వాళ్లు కూడా ఉన్నారని అన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించిందని గుర్తు చేశారు. తాము ఎవరి కోసమే సమ్మె చేయబోమనీ, అవసరం వస్తే ఉద్యోగుల కోసమే చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నాయకులు ఎ వెంకట్, జి సదానందంగౌడ్, కటకం రమేష్, ఎన్ తిరుపతి, ఎండీ అబ్దుల్లా, సంగి రమేష్, ఎంబి కృష్ణ యాదవ్, వినోద్‌కుమార్, బి కొండయ్య, రామారావు, శ్రీకాంత్, ఉమాదేవి, మామిడి నారాయణ తదితరులు పాల్గొన్నారు.


