రాష్ట్రంలో బీజేపీ, మోడీ గాలి లేదు

– రాష్ట్రమంతా కేసీఆర్‌ గాలే వీస్తుంది
– ఈటల చిత్తుగా పోడిపోవడం ఖాయం
– బీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి పార్లమెంట్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
బీజేపీ, మోడీ గాలి అస్సలు లేదనీ, రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్‌ గాలే వీస్తుందని బీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి పార్లమెంట్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. గల్లీలో ఉన్న మాల్కాజిగిరి వాళ్లే ఢిల్లీలోనూ ఉండాలన్నారు. బుధవారం నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తాము 25 ఏండ్లుగా ప్రజాక్షేత్రంలో ఉండి బడుగు, బలహీన వర్గాల పేదల కోసం ఎన్నో సంక్షేమ, సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. కరెంటు, నీళ్ల సమస్యలు తీర్చారన్నారు. పార్లమెంటులో మన తెలంగాణ గళం వినిపించాలంటే తనను ఎంపీగా గెలిపించాలనీ, కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోసపు కాంగ్రెస్‌ను నమ్మొద్దని ప్రజలను కోరారు. హుజురాబాద్‌, గజ్వేల్‌లో ఓడిన ఈటల మల్కాజిజిగిరిలో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. ఇక్కడా చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం అన్నారు. మతతత్వ బీజేపీ కావాలా..? అవినీతి కాంగ్రెస్‌ కావాలా..? హైదరాబాద్‌ను విశ్వ నగరంగా అభివృద్ధి చేసిన బీఆర్‌ఎస్‌ కావాలా..? మల్కాజిగిరి ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు. లోకల్‌ కావాలో.. నాన్‌ లోకల్‌ కావాలో..? ప్రజలు ఆలోచించాలన్నారు. ఈటల రాజేందర్‌ స్థానికుడు కాదనీ, ఆయనకు ఇక్కడ ఓటు అడిగే హక్కు లేదన్నారు. తాను ఇక్కడి స్థానికుడుని అనీ, హబ్సిగూడ ప్రాంత వాసిని, మీ కుటుంబ సభ్యుడిగా భావించి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద్‌, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, బొగ్గారపు దయానంద్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు తదితరులు ల్గొన్నారు.

Spread the love