వారికి కనీస వేతనం చెల్లించాలి

They should be paid minimum wages–  మండలిలో నర్సిరెడ్డి పిటిషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు), సమగ్ర శిక్ష, ప్రభుత్వ యూనివర్సిటీలు, కళాశాలలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పార్ట్‌టైం అధ్యాపకులు, గంటల పద్ధతిలో పని చేసే ఉపాద్యాయులు, గెస్ట్‌ లెక్చరర్లకు కనీస వేతనాలు చెల్లించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం శాసనమండలిలో పిటిషన్‌ సమర్పించారు.
బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ వేళల్ని మార్చాలి
రాష్ట్రంలో వెనకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్‌ స్కూళ్ల కాల నిర్ణయ పట్టిక (టైం టేబుల్‌) ఇబ్బందికరంగా ఉందని నర్సిరెడ్డి తెలిపారు. ఈ పట్టికను సాంఘీక, గిరిజన, మైనార్టీ సంక్షేమ రెసిడెన్షియల్‌ స్కూళ్ల మాదిరిగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటలకు మార్చాలని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఉపాధ్యాయుల కొరతపై చర్చించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య, సర్వీసు పనులకు సంబంధించి గ్రామ పంచాయతీ, మున్సిపాల్టీ, కార్పొరేషన్ల నిర్వహణ తీరు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై చర్చించాలని అలుగుబెల్లి వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు.

వైట్‌కోట్‌ విప్లవం సాధించాం వైద్యుల ఉత్పత్తిలో మనమే నెంబర్‌ వన్‌: మండలిలో హరీశ్‌ రావు
వైద్యులను తయారు చేయడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌గా నిలిచిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. తొమ్మిదేండ్లలో వైట్‌కోట్‌ (తెల్లకోటు) విప్లవం సాధించినట్టు చెప్పారు. శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా హరీశ్‌ రావు సమాధానమిస్తూ, రాష్ట్రం రాకముందు తెలంగాణలో ఐదు మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవనీ, తొమ్మిదేండ్లలో 23 ప్రభుత్వ కళాశాలలు రాగా, మరో ఎనిమిదింటిని మంజూరు చేశామని గుర్తుచేశారు. అవి వచ్చే విద్యాసంవత్సరానికి ప్రారంభమవుతాయన్నారు. కోర్టు స్టే ఎత్తేసిన తర్వాత ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనాన్ని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆస్పత్రుల పాలనకు జిల్లాకు ఒక డీఆర్‌ఓ స్థాయి అధికారిని నియమించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు.
ఫసల్‌ బీమా యోజన ఎందుకు కొనసాగిస్తున్నారు? : మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
ఫసల్‌ బీమా యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్రాలు ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నయో అర్థం కావడం లేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ తెలిపారు. ఆ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు చెల్లిస్తున్న ప్రీమియం కన్నా పొందుతున్న బీమా తక్కువగా ఉందని చెప్పారు. ఆ పథకం బీమా కంపెనీలకే ప్రయోజనకరంగా ఉందనీ, బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్‌ కూడా దాన్నుంచి వైదొలిగిందని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం కూడా అందుకే ఆ పథకాన్ని అమలు చేయడం లేదని చెప్పారు. బీమా కంపెనీలకు లాభం లేకుంటే అవి ముందుకు రావన్నారు. అందువల్ల రైతులు నష్టపోకుండా, బీమా కంపెనీలకు నష్టం వాటిల్లినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని పరిస్థితి గట్టెక్కించేలా విధానాన్ని రూపొందించాలని కేంద్రానికి సూచించినట్టు తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పాలిత రాష్ట్రాల కన్నా:మంత్రి ఎర్రబెల్లి
దేశంలోనే అత్యధికంగా పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో మరీ తక్కువగా ఇస్తున్నారనీ, వామపక్ష ప్రభుత్వం ఉన్న కేరళలో కొంచెం ఫర్వాలేదని చెప్పారు. అదే తెలంగాణలో వికలాంగులకు రూ.4 వేలు, ఇతరులకు ఎక్కువ మొత్తంలో పెన్షన్లు అందుతున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.4 వేలు పెన్షన్‌ ఇస్తామంటున్న పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. అక్కడ ఇచ్చి ఇక్కడ కూడా ఇస్తామంటే బాగుండేదని ఎద్దేవా చేశారు.
గురుకులాలకు రెట్టింపు పోటీ : మంత్రి సత్యవతి రాథోడ్‌
గురుకులాల్లో ఉన్న సీట్లకు రెట్టింపు సంఖ్యలో ప్రవేశాల కోసం విద్యార్థులు పోటీ పడుతున్నారని గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం గురుకులాలు, సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని గుర్తుచేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి మాట్లాడుతూ, గురుకులాల్లో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డితో పాటు బీఆర్‌ఎస్‌ సభ్యులు, గురుకులాల్లో సీట్ల కోసం సిఫారసు లేఖ ఇవ్వాలంటూ ప్రతి రోజూ ప్రజా ప్రతినిధుల వద్దకు డిమాండ్లు వస్తుంటాయని గుర్తుచేశారు.
సమాన పనికి సమాన వేతనమివ్వాలి జీపీ కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోరా : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో సేవలు అందిస్తున్న పారిశుధ్య కార్మికులు, కారోబార్‌లు నిరవధిక సమ్మె చేస్తున్నారని తెలిపారు. మల్టీపర్పస్‌ విధానం తీసుకొచ్చి పారిశుధ్య కార్మికులతోనే ట్రాక్టర్లు నడిపిస్తున్నారన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్మికులకు రూ.8500 వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని, పట్టణాల్లో రూ.15900 వేతనం ఇస్తున్నారని చెప్పారు. పారిశుధ్య కార్మికులు నెల రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో గ్రామాల్లో పారిశుధ్యం పేరుకుపోయిందన్నారు. పారిశుధ్య కార్మికుల్లో 90శాతం మంది దళితులే ఉన్నారని, వారితో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని అన్నారు. సమ్మెల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు పీఎఫ్‌ అమలు చేయాలన్నారు.

Spread the love