అక్రమ బొగ్గు గని కూలి ముగ్గురి మృతి…

నవతెలంగాణ – ధన్‌బాద్‌: ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గుగనిలో ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గనిలో అక్రమంగా తవ్వకాలు కొనసాగుతుండగా ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో కనీసం ముగ్గురు మృతిచెందగా.. అనేక మంది చిక్కుకొని ఉంటారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం 10.30గంటల సమయంలో భారత్‌ కోకింగ్‌కోల్‌ లిమిటెడ్‌ (బీసీసీఎల్‌)లోని భౌరా కాలరీ ప్రాంతంలో చోటుచేసుకోగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై సింద్రీ డీఎస్సీ అభిశేక్‌ కుమా మాట్లాడుతూ.. సహాయక చర్యలు పూర్తయిన తర్వాతే ఎంతమంది మృతిచెందారు? గాయపడిన వారెందరు అనే వివరాలను చెప్పగలమన్నారు. గనిలోకి అక్రమంగా మైనింగ్‌ చేపడుతున్నప్పుడు స్థానిక గ్రామస్థులు అనేకమంది పనుల్లో ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదం అనంతరం స్థానికుల సహాయంతో ముగ్గురిని శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చామని, ఆ తర్వాత వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించినట్టు తెలిపారు. భౌరా పోలీసుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Spread the love