గాలిలో ఢీకొట్టుకున్న శిక్షణా విమానాలు.. ముగ్గురు పైలెట్లు మృతి

నవతెలంగాణ – ఉక్రెయిన్‌
ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సమీపంలో గాలిలో ఎగురుతున్న రెండు ఎల్‌-39 శిక్షణా విమానాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉక్రెయిన్‌ పైలెట్లు మృతి చెందారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు పశ్చిమాన ఉన్న జైటోమిర్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. పశ్చిమ దేశాల నుంచి అందుకున్న ఫైటర్‌ జెట్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు ఉక్రెయిన్‌ భారీగా కసరత్తుకు సిద్ధమవుతున్నది. ప్రమాదంలో మరణించిన ముగ్గురు మిలటరీ పైలట్లలో ఉక్రెయిన్‌ ఆర్మీ ఆఫీసర్‌ ఆండ్రీ పిల్షికోవ్ ఉన్నారు. ఆయన దేశానికి అంకితభావంతో సేవ చేశారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. పశ్చిమ దేశాల నుంచి వచ్చిన ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్స్‌ను ఎగురవేయడానికి ఉక్రేనియన్‌ సైనికులకు శిక్షణ ఇవ్వాలని చూస్తున్నారు. ముగ్గురు పైలెట్ల మరణం కోలుకోలేని నష్టమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇది మనందరికీ భరించలేని, పూడ్చలేని నష్టమన్నారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యల తర్వాత.. రెండు దేశాల సైన్యాలు క్రమం తప్పకుండా పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. మొదట్లో వెనుకబడిన ఉక్రెయిన్‌.. పాశ్చాత్య దేశాల సైనిక సహాయంతో రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ సైన్యం పోరాడుతున్నది. దీని ఫలితమే ఈ యుద్ధంలో ఉక్రెయిన్.. రష్యాపై ఆధిపత్యం చెలాయించేలా కనిపిస్తోంది.

Spread the love