సత్యపాల్‌ తులికి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నివాళి

..జి రఘుపాల్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ సాయుధ పోరాటానికి తన వంతు సాయాన్ని అందించిన సత్యపాల్‌ తులికి సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్‌వీకే) బృందం శనివారం ఆయన వర్థంతి సందర్భంగా నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సత్యపాల్‌తో సన్నిహితం గా మెలిగిన ఎస్వీకే మేనేజింగ్‌ కమిటీ సభ్యులు జి. రఘుపాల్‌ మాట్లాడుతూ డాక్టర్‌ తులి 1976 మే 20న హైదరాబాదులో మరణించారని తెలిపారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి పి.సి. జోషితో లెటర్‌ తీసుకొని వచ్చిన తులి.. అజ్ఞాతంలో గొర్లకాపరి వేషంలో ఉన్న సుందరయ్యను యాదగిరి గుట్ట సమీపంలో కలిసి ఆయన సలహామేరకు హైదరాబాదులో స్థిర పడ్డారని గుర్తుచేశారు.
ఉదయం పూట క్లినిక్‌ నడుపుతూ రాత్రివేళల్లో రహస్యంగా వెళ్లి సాయుధ పోరాట యోధులకు వైద్యం చేసేవారని తెలిపారు. క్లినిక్‌లో కూడా పైసా, రెండు పైసలకు వచ్చే మందులు రాసేవారన్నారు. దీంతో ఆయనకు ఏక్‌ పైసా దో పైసా డాక్టర్‌గా పేరు స్థిర పడిందని వివరించారు. కమ్యూనిస్టు పార్టీ పెద్ద నాయకులే కాదు.. కాంగ్రెస్‌కు చెందిన నాయకులు కూడా వచ్చి వైద్యం చేయించుకునేవారని తెలిపారు. కండరాల జబ్బుతో సతమతమయినప్పటికీ చివరి దాకా ప్రజలకు వైద్యం అందించారన్నారు. నిలోఫర్‌ ఆస్పత్రి సూపరిండెం ట్‌గా పని చేసిన డాక్టర్‌ శ్యామలాంబ ఆయన శిష్యురాలని తెలిపారు. ఎంతో మంది ఆర్‌ఎంపీలు ఆయన దగ్గర శిక్షణ కోసం వచ్చేవారన్నారు. పూర్తి అంకిత భావంతో పంజాబ్‌ నుండి హైదరాబాదు కు వైద్యుడిగా దాదాపు మూడు దశాబ్దాలు ప్రజలకు తన సేవలందించారని గుర్తు చేశారు.
డాక్టర్‌ తులి వైద్యరంగంలో ఉన్న వారందరికీ ఆదర్శ ప్రాయుడని చెప్పారు. సమావేశానికి ఎస్‌ఏకె మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌. వినయ కుమార్‌ అధ్యక్షత వహించారు. వైద్యరంగంలో డాక్టర్‌ తులి నెలకొల్పిన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతోనే ఆయన పేర హైదరాబాద్‌లోని ఎస్‌వీకే దగ్గర మొదటి జనరిక్‌ మందుల షాపును ప్రారంభించామని చెప్పారు. క్రమంగా తెలంగాణలో జనరిక్‌ షాపులను ఎస్‌వీకే విస్తరిస్తోందని తెలిపారు. సిబ్బందితో పాటు కమిటీ సభ్యులు జి. బుచ్చిరెడ్డి ఎన్‌. సోమయ్య, భూపతి వెంకటేశ్వర్లు సమావేశంలో పాల్గొన్నారు.

Spread the love