ఉగాది.. రంజాన్‌…

 Ugadi.. Ramzan...రాష్ట్రంలో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా ముగిశాయి. ఒక్కరోజు తేడాతో గురువారం రంజాన్‌ పర్వదినం వచ్చింది. గతంలో కొన్నిసార్లు వినాయక చవితి, రంజాన్‌ ఒకే సమయంలో వచ్చిన దాఖలాలున్నాయి. గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక అయిన హైదరాబాద్‌ నగరంలో ఈ రెండు పండుగల సమయాల్లోనే కాదు.. ప్రతీ సందర్భంలోనూ హిందూ ముస్లిం భాయి భాయి అనే సందేశం వినిపిస్తూ ఉంటుంది. మత సామరస్యం ఎల్లెడలా పరిఢవిస్తూ ఉంటుంది. గణేశ్‌ మండపాల తయారీలో అత్యధిక సంఖ్యలో పాలుపంచుకునేది ముస్లిం సోదరులే. ఇలా ఒక తల్లిబిడ్డల్లా కలిసి మెలిసి ఉండే ప్రజలకు ఇప్పుడు అసలు సిసలు సవాల్‌ ఎదురుకాబోతోంది. అదే లోక్‌సభ ఎన్నికల ప్రహసనం.
అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ… గుంట నక్కలూ, గుడ్ల గూబలూ ఆ ప్రశాంతతను భగం చేసేం దుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటాయి. ఇప్పుడు తెలంగాణలో పరమత సహనం, సోదరతత్వం, పరస్పర గౌరవంతో కూడిన ప్రశాంతతను భగం చేసేందుకు అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. మొన్నటిదాకా గుడి… ఇప్పుడు ‘….డీ’ పేరిట ఒక అతి పెద్ద అల (వేవ్‌) రాబోతోం దంటూ కొన్ని ప్రతీత శక్తులు ప్రచారం చేసుకుంటున్నాయి. అలాంటి వేవ్‌ కాని వేవ్‌, ఇంకా చెప్పాలంటే బలవంతంగా సృష్టించిన వేవ్‌ వచ్చిన ఉత్తరాదిలో గత పదేండ్ల నుంచి ఏం జరిగిందో మనకందరికీ తెలిసిందే. దళితులు, మైనారిటీలు, మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, ‘హత్రాస్‌’ ఘటనలతో ఆయా రాష్ట్రాలు అతలాకుతలమైన దృష్టాం తాలు అనేకం. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మారుస్తాం.. మనువాదాన్నే అమలు చేస్తామనే కాషాయదళ విన్యాసాలతో దేశం భీతిల్లుతోంది.
కమలాధీశులు అధికారంలోకి వచ్చిన ఈ పదేండ్ల కాలంలో దేశంలో జరిగిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదు. కరోనా కరాళ నృత్యాలు చేసిన వేళ… ప్రజలను కర్కశంగా గాలికొదిలేసి, కార్పొరేట్లకు ఎర్రతివాచీ పరిచి, లక్షలాది కోట్ల రూపాయల రాయితీలిచ్చిన ఉదంతాలను మనం మరిచిపోరాదు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోల్‌, గ్యాస్‌ ధరల పెంపు సామాన్యుడి నడ్డి విరిచాయి. ఈ భారాలకు తెలంగాణ ప్రజలు సైతం అతీతులు కారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలంటూ ఊదరగొట్టి… గద్దెనెక్కిన ‘పరివార’ ప్రముఖులు, ఆ తర్వాత దాని ఊసే మరిచారు. ఈ కోటాలో తెలంగాణకు ఒక్కటంటే ఒక్క ఉద్యోగమూ రాలేదు. రాష్ట్ర విభజన చట్టంలోని రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ప్రాజెక్టులకు జాతీయ హోదా, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ తదితరాలు ఎప్పుడో గాలికి కొట్టుకుపోయాయి. వీటన్నింటినీ పక్కనబెట్టి మిత్రోన్‌… ‘అచ్ఛేదిన్‌’ అంటూ ‘విశ్వగురు’ చెప్పే మాటలకు, చెవిలో పెట్టే ‘కమలం పూల’కు తెలంగాణ ప్రజానీకం పడిపోతారనుకుంటే అది తెలివి తక్కువతనమే అవుతుంది.
అయితే రానున్న ప్రమాదాన్ని మాత్రం మనం తక్కువ అంచనా వేస్తే అది తప్పులో కాలేసినట్టే. స్వయం కృతాపరాధాలు, అహంభావాలతో అతలాకుతలమై అధికారాన్ని పోగొట్టుకున్న ‘గులాబీ’ స్థానంలో ఇప్పుడు ‘కమలం పువ్వు’ వచ్చి చేరుతోందనే వార్తలు లౌకికవాదులను, అభ్యుదయ శక్తులను, మేధావులను, సామాజికవేత్తలను కలవర పెడుతోంది. ఇటీవల రాష్ట్ర రాజధాని నగరంలో నిర్వహించిన పలు సదస్సులు, సమావేశాలు, చర్చాగోష్టుల్లో వక్తలు ఇదే విషయాన్ని చెప్పి, ముంచుకొస్తున్న ముప్పు గురించి హెచ్చరించారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్థితిగతులు, ప్రజల జీవనప్రమాణాల గురించి కాకుండా మతాన్ని అడ్డం పెట్టుకుని ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం కాషాయ పార్టీ ప్రధాన పని. గతంలో పలు సందర్భాల్లో సమాధులు, శవాలు, శివలింగాలనే మాటలను విన్నాం. వాటిని వాడటం ద్వారా ఆ పార్టీ ఎన్నికల్లో లబ్ది పొందిన వైనాన్ని మనం చూశాం. మళ్లీ అలాంటి హెచ్చరికలే ఇప్పుడు వినబడు తున్నాయి. తెలంగాణలోని దక్షిణాదిన ఇలాంటి పప్పులుడక్కపోయినా, ఉత్తరాదిన మాత్రం ఆ ప్రమాదం లేకపోలేదు. అందుకే ఉగాది, రంజాన్‌లను సుహృద్భావ వాతావరణంలో జరుపుకుంటున్న మనం… అదే స్ఫూర్తితో ఇప్పుడు కమలం కుట్రలను తిప్పికొట్టాలి. జాగరూకతతో ఓటేయటం ద్వారా తెలంగాణలో దానికి స్థానం లేకుండా చేయాలి. అదే ఇప్పుడు మన ముందున్న అసలు సిసలు కర్తవ్యం.

Spread the love