వీర తెలంగాణ స్ఫూర్తిని మసకబార్చలేరు!

     వీర తెలంగాణ రైతాంగ పోరాటంలో అమరులైన నాలుగు వేల మంది తెలంగాణ బిడ్డల అసమాన త్యాగాలు, పక్కదారి పట్టిన లక్ష్యాల కోసం జరిగినవేనంటే.. ఆ ప్రజల త్యాగాలనూ, పాల్గొన్న వారినీ అపహాస్యం చేసినట్టే కదా? ఇంత స్పష్టంగా కనబడుతున్న సత్యానికి ముసుగు వేస్తానంటే కుదురుతుందా డాని గారు? కుల మత విభేదాలను పక్కకు పెట్టిన సామాన్య ప్రజలు.. భూమికోసం, భుక్తి కోసం, పీడిత జన విముక్తి కోసం, మౌలిక సమస్యల సాధన కోసం… ఐక్యంగా  ఉద్యమించారనే చారిత్రక దృష్టాంతంలో గొప్పతనం ఏమీ లేదంటూ, దారి తప్పిన లక్ష్యం కోసం సాగిందేనంటూ చేస్తున్న ప్రచారం… నేటి కాలంలో ఎవరి  స్వార్ధ ప్రయోజనాలకు ఉపకరిస్తుందనే సోయి డానికి లేదంటే నమ్మలేం. ఇతర వ్యాసకర్తలు లెవనెత్తిన ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పలేక… డివి ప్రస్తావించిన అంశాల్లోని ఆ కీలకమైన వాక్యాన్ని ఎందుకు వదిలేశారో చెప్పుకోలేక.. డాని తన రెండవ వ్యాసంలో డివి ఒక్కరే కాదు.. దాశరధి రంగా చార్య, సుద్దాల హనుమంతు రచనల్లోనూ సదరు మతకోణం కనపడుతుందంటూ కప్పదాటు మాటలు మాట్లాడుతున్నారు. ఇక మనమేం చెప్పగలం? అయ్యా, డాని… దాశరధి, సుద్దాల రచనలలో మీరు ఆవిష్కరించిన మతకోణం… ఏ పుస్తకంలో, ఏయే పేజీలలో ఉందో చెప్తే ఆ పుస్తకాలని సైతం ఫ్యాక్ట్‌ చెక్‌ చేసి… అక్కడ సైతం మీరు వదిలేసిన, వక్రీకరించిన వాక్యాలు ఏమైనా ఉన్నాయో, మేము వెతికి పట్టుకోగలం. దయచేసి అలా ప్రయత్నించండి, ఇది మాత్రం వృథా ప్రయాస!

      భారతదేశ ప్రజల సామ్యవాద ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలిచిన చారిత్రక ఘట్టం వీర తెలంగాణ రైతాంగ పోరాటం. 1940, 50వ దశకాలలో సాగిన ఆ మహోన్నత చారిత్రక ఘట్టాన్ని వక్రీకరిస్తూ, ఆ ప్రజా పోరాటాన్ని రెండు మతాల మధ్య గొడవగా మతోన్మాదులు ప్రచారం చేస్తున్నారు. తాజాగా మత అస్థిత్వవాదులు అనేవారూ మరోవైపునుండి మోపై… ఆ పోరాటంలో పాల్గొన్న నాయకులు, ప్రజలకు మతపర ఆకాంక్షలను, ఇతర దురుద్దేశాలను అంటగడుతున్నారు. ‘వీర తెలంగాణ’ను కించపరిచే తన ప్రాజెక్టులో భాగంగా… సీనియర్‌ జర్నలిస్టు డాని ఆంధ్రజ్యోతి దినపత్రికలో వరుసపెట్టి రెండు వ్యాసాలు రాశారు. గతనెల 25న ప్రచురితమైన తన రెండవ వ్యాసంలో (‘సూత్రధారి ఆర్యసమాజ్‌, పాత్రధారి కాంగ్రెస్‌, కాల్బలం కమ్యూనిస్టు పార్టీ’) కమ్యూనిస్టులపై, వీర తెలంగాణ పోరాటంలో పాల్గొన్న ప్రజలపై నిరాధార నిందలని డాని కొనసాగించారు. తన వాదనలకు మద్దతుగా ఆయన తన మొదటి వ్యాసంలో ప్రస్తావించిన సాక్ష్యాలలోని డొల్లతనాన్ని ఇతర వ్యాసకర్తలు బహిర్గతపరచగా… సాక్ష్యంగా అవి పనిచేయకపోతే, మరికొన్ని ఉన్నాయంటూ సునాయాసంగా జంపింగు చేశారు.
తన తొలివ్యాసంలోని ఆరోపణలన్నీ కమ్యూనిస్టు పార్టీల నాయకుల మీదనేగానీ, పోరాటంలో పాల్గొన్న ప్రజల మీద కాదంటూ డాని చెప్పుకొచ్చారు. డాని తొలి వ్యాసంలో చేసిన ప్రధాన ఆరోపణ ఇలా సాగింది… ”వీర తెలంగాణ పోరాటమే మత కారణాలతో మొదలైంది… ఇక్కడి రాజు ముస్లిం కాబట్టే హిందువులయిన నాటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు పోరాటం మొదలెట్టారు… ముస్లింలు సంస్థాన అధిపతులుగా లేని చోట్ల కమ్యూనిస్టుల పోరాటం నడవలేదు” అసలు పోరాటమే తప్పుడు ఉద్దేశాలతో మొదలైంది, తప్పుడు ఉద్దేశాలతో కొనసాగింది అని డాని అంటున్నప్పుడు… ఆయన గారి ఆరోపణ పాల్గొన్న ప్రజల మీద కూడా చేసినట్టే కదా? వీర తెలంగాణ రైతాంగ పోరాటంలో అమరులైన నాలుగు వేల మంది తెలంగాణ బిడ్డల అసమాన త్యాగాలు, పక్కదారి పట్టిన లక్ష్యాల కోసం జరిగినవేనంటే.. ఆ ప్రజల త్యాగాలనూ, పాల్గొన్న వారినీ అపహాస్యం చేసినట్టే కదా? ఇంత స్పష్టంగా కనబడుతున్న సత్యానికి ముసుగు వేస్తానంటే కుదురుతుందా డాని గారు? కుల మత విభేదాలను పక్కకు పెట్టిన సామాన్య ప్రజలు.. భూమికోసం, భుక్తి కోసం, పీడిత జన విముక్తి కోసం, మౌలిక సమస్యల సాధన కోసం… ఐక్యంగా ఉద్యమించారనే చారిత్రక దృష్టాంతంలో గొప్పతనం ఏమీ లేదంటూ, దారి తప్పిన లక్ష్యం కోసం సాగిందేనంటూ చేస్తున్న ప్రచారం… నేటి కాలంలో ఎవరి స్వార్ధ ప్రయోజనాలకు ఉపకరిస్తుందనే సోయి డానికి లేదంటే నమ్మలేం.
ఆ రోజుల్లో తెలంగాణలో ఆర్య సమాజ్‌ కార్యక్షేత్రం పెద్దదంటూ డాని వేసిన అంచనా కూడా తప్పే. నాటి తెలంగాణ పరిస్థితుల గురించి అవగాహన కలిగిన వారెవరైనా… ఆర్యసమాజ్‌కు అంత సీను లేదంటారు. తనను తాను ముస్లిం సామాజిక వర్గాల ప్రతినిధిగా చెప్పుకుంటున్న డానిగారు… తన సౌలభ్యం కోసమే ఆర్యసమాజ్‌కు లేని పెద్దరికాన్ని అంటగట్టారు. హిందూ మతానికి ప్రాతనిధ్యం వహించే సంస్థ కారణంగానే విలీనం జరిగిందని, ఆర్యసమాజే విలీనానికి సూత్రధారని చెప్పుకుంటేనే… హిందూ మత రాజకీయాలకు ముస్లింలు బాధితులయ్యారంటూ సాగే ఫాల్స్‌ నేరేటివ్సును నడపొచ్చని ఆయన భావించి ఉండవచ్చు. హైదరాబాద్‌ సంస్ధాన విలీనానికి సూత్రధారి ఆర్యసమాజ్‌, పాత్రధారి కాంగ్రెస్‌ కాగా… కాల్బలంగా భారత కమ్యూనిస్టు పార్టీ పనిచేసిందని డానీ ఈ వ్యాసంలో తేల్చేసారు. వీర తెలంగాణ రైతాంగ పోరాటానికి సారధ్యం వహించింది కమ్యూనిస్టుపార్టీ ఒక్కటే. నాటి హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడైన స్వామి రామానంద తీర్థ ఢిల్లీకి వెళ్లి మహాత్మా గాంధీతో సమావేశమై, నిజాం రాజు ఆగడాలను వివరించి హైదరాబాద్‌ సంస్థానంలోని ప్రజలకు అండగా కాంగ్రెస్‌ నిలబడాలని కోరినప్పుడు… ”మన పోరాటం విదేశీ బ్రిటిషర్లపైననే, స్వదేశీ రాజు నిజాంకు వ్యతిరేకంగా ఎలాంటి ఉద్యమాలు చేయకూడదు” అంటూ ఆయన స్వామి రామానంద తీర్థను మందలించి ఆదేశాలు జారీ చేశాడు. భారత జాతిపితనే తెలంగాణ బిడ్డల గోడును వినడానికి నిరాకరించి… నిజాం రాజుకు మద్ధతుగా నిలిచిన ఆ నేపథ్యంలో… అరిగోసల పాలవుతున్న తెలంగాణ బిడ్డలకు అండగా, ఆలంబనగా నిలిచిన ఏకైక శక్తి నాటి కమ్యూనిస్టు పార్టీయే. కాంగ్రెస్‌ పార్టీతో పాటు, కొన్ని ప్రాంతాలలో కార్యకలాపాలు సాగిస్తున్న ఆర్యసమాజ్‌ సైతం… దొరలపక్షం వహించి, విలీనానికి మద్దతుగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తెలంగాణ మట్టి మనుషుల తరఫున నిలబడి, దొరలపై, దొరలకు పెద్దన్న నిజాంపై పోరాటం చేసిన కమ్యూనిస్టు పార్టీ కూడా… విలీనం కోసం పనిచేసిందనడం చరిత్రను గుర్తించ నిరాకరించడమే. రావి నారాయణరెడ్డి లాంటి మితవాదులు పోరాట విరమణ చేయాలంటూ పట్టుబట్టినా… తెలంగాణ బిడ్డలు పోరాడి సాధించుకున్న ఫలాలు వారికే దక్కాలంటే ఏ తోవ తొక్కాలనేది… కమ్యూనిస్టులు తమ కమిటీలో ప్రజాస్వామికంగా చర్చించి నిర్ణయించుకున్నారు.
స్వతంత్ర భారతంలో… ఢిల్లీ పీఠమెక్కిన కాంగ్రెస్‌ పెద్దలు… భూస్వాములు, పెట్టుబడిదారుల పక్షం వహించడాన్ని తెలంగాణ ప్రజలు గమనించారు. పక్కనున్న ఆంధ్ర ప్రాంతంలో (నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం) పాలన చేస్తున్న టంగుటూరి ప్రకాశం సర్కారు… ”పబ్లిక్‌ సేఫ్టీ ఆర్డినెన్స్‌” పేరుతో రైతు ఉద్యమాలను తీవ్రంగా అణచివేయడాన్ని, భూస్వాముల కొమ్ము కాయడాన్నీ చూసిన తెలంగాణ ప్రజలు… కాంగ్రెసుపార్టీ ఎవరిపక్షమో అర్థం చేసుకున్నారు. మరోవైపు తెలంగాణలోని భూస్వాముల ప్రతినిధులు… కొండా వెంకటరంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి మొదలైనవారు ఢిల్లీకి చేరి తెలంగాణ బిడ్డలకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టారు. ”తెలంగాణలో నెలకొన్న పరిస్థితి గురించి కాంగ్రెస్‌ నాయకుల నివేదిక మాకందింది. భూస్వాములపై జరుగుతున్న దాడులను మేం ఒప్పుకోము. త్వరలోనే తగు చర్య తీసుకుంటాం’ అని ఢిల్లీలో హౌంమంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయి పటేల్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తప్పనిసరై… పటేల్‌ సైన్యాలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగించాలని కమ్యునిస్టులు నిర్ణయించారు. పోరాడి సాధించుకున్న భూములను వదిలేది లేదంటూ తెగించిన తెలంగాణ బిడ్డలూ సై అన్నారు.
విలీనానికి కాల్బలంగా కాదు, నిజానికి నాటి కమ్యూనిస్టు పార్టీ కష్టజీవుల ఐక్య ప్రతిఘటనా శక్తిగా పనిచేసింది. డాని వక్రీకరించినట్టుగా కమ్యూనిస్టులు విలీనానికి సహకరించే వారే అయితే… 1948 సెప్టెంబర్‌ 17ననే పోరాట విరమణ చేసి ఉండేవారు. అలా కాకుండా… ఆ తర్వాత మరో మూడేండ్ల పాటు కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ బిడ్డల పోరాటం కొనసాగింది. తెలంగాణ దొరల తరఫున రంగ ప్రవేశం చేసిన నెహ్రూ సైన్యాల సాధనా సంపత్తుల ముందు తమ బలం సరిపోవట్లేదని నిర్ణయించుకున్న తర్వాత… తప్పనిసరి పరిస్థితుల్లోనే 1951 అక్టోబర్‌ 21న పోరాట విరమణ జరిగింది. తమ బలం సరిపోక, అమాయక ప్రజల త్యాగాలను నిలువరించడానికి పోరాట విరమణ చేస్తే… శత్రువుకు సహకరించినట్టు ఎలా అవుతుందో డానీ తేల్చాలి. ”నెహ్రూ ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యలో 3500మంది కమ్యూనిస్టు కార్యకర్తలు చనిపోయారు” అంటూ డానీ స్వయంగా అంగీకరించాక… ఇక విలీనానికి కమ్యూనిస్టు పార్టీ కాల్బలంగా పనిచేసిందనే ఆరోపణ అసంబద్ధమే కదా? డాని తరహా తప్పుడు నిర్ధారణలు ప్రజాపక్షం వహించే వారి నుండి వస్తాయో… పాలకులకు వత్తాసు పలికే వారి నుండి వస్తాయో… ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. 1984 ఢిల్లీ అల్లర్ల తరువాత మైనారిటీ సమూహాలు తమ భావోద్వేగాలను వ్యక్తం చేసే దశ ఆరంభం అయిందని తీర్మానిస్తున్న డాని… 1948లలోనే షోయబుల్లాఖాన్‌, మఖ్దామ్‌ మొహియుద్దీన్లు వారి వెంట నడిచిన వారూ… మతం పేరుతో తన నియంతృత్వాన్ని కొనసాగించదలచుకున్న నిజాం ఆగడాలకు ఎదురొడ్డి నిలిచిన వైనాన్ని… ”అవ్యక్త సందేశం” గానే కొట్టివేయదలుచుకున్నారా? అవి ముస్లిం సమాజపు గొంతుకలు కావని ఎలా నిర్థారిస్తారు? శ్రమజీవుల ఐక్యతకు మద్దతుగా నిలిచేది అస్తిత్వం కాదు గానీ… ఎవరికి వారు విడిపోయి, దోపిడీదారుల పని ఆసాన్‌ చేసేదే అస్తిత్వమనే డాని విశ్లేషణ హేతు విరుద్ధమే.
”వీర తెలంగాణ పోరాటం రెండు జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాల్లో జరగలేదని ఇతర వ్యాసకర్తలు ఏదో విధంగా ప్రస్తావించారు” అంటూ డాని అతిసులువుగా అబద్ధమాడేశారు. డివి పుస్తకంలోని కొన్ని వాక్యాలను డాని… తన సౌలభ్యం కోసం వదిలేసిన వైనాన్ని, డివి మాటలను వక్రీకరించిన విధానాన్ని మాత్రమే ఆ వ్యాసకర్తలు ప్రస్తావించారు. డివి తన పుస్తకంలో చేసుకున్న ఆత్మవిమర్శలో మత కోణం కూడ ఉన్నది అంటూ మరోమారు పాత వాదననే ముందుకు తీసుకొస్తున్నారు డానీ. నిజానికి డివి రచనలో మత కోణాన్ని సమర్థించే రీతిలో ఎలాంటి మాటలూ లేవని.. డివి మనసులోలేని మతకోణాన్ని డానీ కొత్తగా ఆవిష్కరించారని ఈ వ్యాసకర్త తన ప్రతిస్పందనలో నేడు వివరించాడు. కమ్యూనిస్టు పార్టీ ఇతర సంస్ధానాల్లో ఉద్యమాలు చేపట్టకపోవడానికి మతకోణమే కారణం అన్న రీతిలో డివి ఎక్కడా రాయలేదు. మిగతా సంస్థానాల్లోని ప్రజల్ని సమీకరించడంలో పార్టీ విఫలమైందని డివి రాస్తే… ”మిగతా చోట్ల అధినేతలు హిందువులే కాబట్టి…” అనే వక్రీకరణ డానీ జతపరిచారంటూ ఈ వ్యాసకర్త పేర్కొన్నాడు. అంతే కాదు, డానీ ఉటంకించిన మాటల తర్వాతి వాక్యంలోనే డివి మరొక కీలక అంశాన్ని కూడా జోడించారని.. డానీ తన సౌలభ్యం కోసం ఆ అంశాన్ని మాత్రం వదిలేశారన్న సత్యాన్ని సైతం ఎత్తి చూపడం జరిగింది. ”తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ పార్టీ సరిగ్గా కృషి చేయలేదు” అని డివి… ఓ రెండు వాక్యాల తర్వాత, అదే పేజీలోనే రాసినప్పుడు.. రాజు ముస్లిం అయిన కారణంగానే కమ్యునిస్టులు తెలంగాణలో పోరాటాలు నిర్వహించారనే అర్థం ఎలా వస్తుంది?
ఇతర వ్యాసకర్తలు లెవనెత్తిన ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పలేక… డివి ప్రస్తావించిన అంశాల్లోని ఆ కీలకమైన వాక్యాన్ని ఎందుకు వదిలేశారో చెప్పుకోలేక.. డాని తన రెండవ వ్యాసంలో డివి ఒక్కరే కాదు.. దాశరధి రంగా చార్య, సుద్దాల హనుమంతు రచనల్లోనూ సదరు మతకోణం కనపడుతుందంటూ కప్పదాటు మాటలు మాట్లాడుతున్నారు. ఇక మనమేం చెప్పగలం? అయ్యా, డాని… దాశరధి, సుద్దాల రచనలలో మీరు ఆవిష్కరించిన మతకోణం… ఏ పుస్తకంలో, ఏయే పేజీలలో ఉందో చెప్తే ఆ పుస్తకాలని సైతం ఫ్యాక్ట్‌ చెక్‌ చేసి… అక్కడ సైతం మీరు వదిలేసిన, వక్రీకరించిన వాక్యాలు ఏమైనా ఉన్నాయో, మేము వెతికి పట్టుకోగలం. దయచేసి అలా ప్రయత్నించండి, ఇది మాత్రం వృథా ప్రయాస!
ఆర్‌. రాజేశమ్‌
సెల్‌: 9440443183

– కన్వీనర్‌, సామాజిక న్యాయవేదిక

Spread the love