వేతన వ్యథలు.. అప్పుల బాధలు

Wage woes.. Debt woes– పదోన్నతులు ఇచ్చారు..జీతాలు మరిచారు
– ఐదు నెలలుగా అందని వేతనాలు
– స్థానికత ఓ దగ్గర..ఉద్యోగం మరో చోట
– ఆందోళనలో పూర్వ వీఆర్‌ఏలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పూర్వ వీఆర్‌ఏల పరిస్థితి దుర్భరంగా తయారైంది. ఐదు నెలలుగా జీత భత్యాలకు నోచుకోక వారు అలమటిస్తున్నారు. గతేడాది చేసిన సుధీర్ఘ పోరాటం ఫలితంగా వారిని క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. ఆయా విభాగాల్లో చేరిన వారికి ఇప్పటి వరకు గుర్తింపు కార్డు కూడా ఇవ్వలేదు. స్థానికత ఓక చోట..ఉద్యోగం మరో చోట చేయలేక ఆర్థిక ఇబ్బందులతో నానా తంటాలు పడుతున్నారు. గతేడాది 80 రోజుల పాటు చేసిన సుధీర్ఘ పోరాటం ఫలితంగా ఐదు నెలల క్రితం వీఆర్‌ఎలకుపే స్కేలు, పదోన్నతి, వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించిన గత ప్రభుత్వం జీవో నెంబర్‌ 81 జారీ చేసింది. డిగ్రీ, ఆపై చదువులు చదివిన వారిని జూనియర్‌ అసిస్టెంట్లుటగా ఇంటర్‌ చదివిన వారిని రికార్డ్‌ అసిస్టెంట్లుగా, పదో తరగతి చదివిన వారిని ఆఫీసు సబార్డినేట్లుగా నియమిస్తూ రాష్ట్రంలోని 20 వేల మంది వీఆర్‌ఎలలో 16 వేల మందిని క్రమబద్ధీకరించారు. ఆయా శాఖల్లో చేరిన వారికి కనీస గుర్తింపు కార్డు ఇవ్వక పోగా వారికి జాబ్‌ చార్ట్‌ కూడా కేటాయించలేదు. ఫలితంగా వారు ఏ శాఖ ఉద్యోగులో తెలియని పరిస్థితి నెలకొంది. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న ఆఫీస్‌ సబార్డినెట్లు సర్కార్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వేసిన కేసును బూచిగా చూపించి ప్రారంభంలో సర్కారు కాలయాపన చేసింది. ఆయితే ఆ కేసును కోర్టు కొట్టేసినా వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన పూర్వ వీఆర్‌ఏల ఉద్యోగ విధులు, బాధ్యతలను నాటి బీఆర్‌ఎస్‌ సర్కారు తేల్చలేదు. ఫలితంగా వారి జీతాలు గత ఐదు నెలలుగా నిలిచి పోయాయి. సమ్మె కాలం నుంచి నేటి వరకు ఆర్థిక ఇబ్బందుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 80 మంది వీఆర్‌ఏలు చనిపోయారు. ఇందులో 20 మందికి పైగా ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఇకనైనా తమకు న్యాయం జరుగుతుందని వారు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు.
ఏటూ తేలని 4 వేల మంది భవితవ్యం
రాష్ట్రంలో ఉన్న 20 వేల మంది వీఆర్‌ఏ లకు గాను 16 వేల మందిని గత ప్రభుత్వం క్రమబద్దీకరించింది. మిగిలిన 4 వేల మంది వీఆర్‌ఏలు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. వారసత్వ ఉద్యోగాలతో పాటు ఖాళీలు లేవనే సాకుతో వీరిని ఇతర శాఖల్లో ప్రభుత్వం సర్దుబాటు చేయలేదు. కొత్త సర్కార్‌ నిర్ణయం కోసం వారు ఎదురు చూస్తున్నారు.
జీతాలు వెంటనే చెల్లించాలి
– వంగూరు రాములు, తెలంగాణ గ్రామ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేసిన పూర్వ వీఆర్‌ఏలకు వెంటనే జీతాలు చెల్లించాలి. ఆయా విభాగాల్లో చేరిన వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు జాబ్‌ చార్ట్‌ను కేటాయించాలి. మిగిలిన 4 వేల మందికి ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలి. పదోన్నతి పొందిన జూనియర్‌ అసిస్టెంట్లు, రికార్డ్‌ అసిస్టెంట్లు, ఆఫీస్‌ సబార్డినేట్లను ఆయా కేటగిరిల్లో ఎన్నికల ఉత్తర్వులు జారిచేసి విధులు చేయించుకున్న ప్రభుత్వం జీతాలు ఇవ్వక పోవడం సరికాదు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం వారికి న్యాయం చేయాలి.

Spread the love