పెళ్ళి సమస్యను వినోదాత్మకంగా చూపించాం

పెళ్ళి సమస్యను వినోదాత్మకంగా చూపించాంఅల్లరి నరేష్‌ తాజాగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ చిలక నిర్మించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించారు.
అల్లరి నరేష్‌ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్‌ టైనర్‌ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ మంచి బజ్‌ క్రియేట్‌ చేశాయి.
మే 3న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాత రాజీవ్‌ చిలక మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
సినిమాలు నిర్మించాలనే ప్రణాళికతో పరిశ్రమలోకి వచ్చాను. మంచి కథ కోసం చూస్తున్నపుడు దర్శకుడు మల్లి ఈ కథ చెప్పారు. పెళ్లి అనేది అందరూ రిలేట్‌ చేసుకునే అంశం. ఈ కథలో కామెడీ, ఎంటర్‌టైన్మెంట్‌, ఎమోషన్స్‌, ఫ్యామిలీ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ ఉన్నాయి. ఈ జోనర్‌ సినిమా మా మొదటి సినిమాగా సెట్‌ అవుతుందని భావించాం.
యానిమేషన్‌ రంగం చాలా కష్టంతో కూడుకున్నది. ముందు కంపెనీని సుస్థిరం చేసే దిశగా పని చేశాం. అయితే సినిమాలు చేయాలని ఎప్పటినుంచో ఉంది. దాదాపు ఆరు యానిమేషన్‌ చిత్రాలు చేశాం. కంపెనీ స్థిరపడిన తర్వాత సినిమాల్లోకి రావాలని భావించాం. ఈ క్రమంలో కొంత సమయం పట్టింది. ఇకపై వరుసగా సినిమాలని నిర్మిస్తాం. ఈ కథ విన్నాకా ఫస్ట్‌ అల్లరి నరేష్‌ గారినే అనుకున్నాం. ఈ కథ నరేష్‌కే యాప్ట్‌. ఆయనకి ఈ కథ చాలా నచ్చింది. పెళ్లి అనేది నేటి రోజుల్లో తన ఒక్కడికే సమస్య, తనకే పెళ్లి కావడం లేదనే ధోరణితో చాలా మంది మానసికంగా క్రుంగుబాటుకి గురౌతున్నారు. ఈ రోజుల్లో సెటిల్‌ అవ్వడం కంటే పెళ్లి అవ్వడం పెద్ద టాస్క్‌గా మారింది. ఒకప్పుడు బంధువులు, చుట్టాలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళే పెళ్లి సంబధాలు చూసే వారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఒకొక్కరూ ఒకొక్క రాష్ట్రంలో, దేశంలో ఉంటున్నారు. పెళ్లి కోసం వెబ్‌ సైట్స్‌ పై ఆధారపడుతున్నారు. మ్యాట్రీమొనీ సైట్స్‌ ద్వారానే లక్షల్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. పైగా ఇందులో ఒకరిగురించి ఒకరికి తెలీయదు కూడా. జీవితానికి సంబధించిన పెద్ద నిర్ణయాన్ని ఇలా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది నేడు యువత ఎదుర్కొంటున్న సమస్య. అందరూ కనెక్ట్‌ అయ్యే సబ్జెక్ట్‌. ఈ కథ చాలా వినోదాత్మకంగా చెప్పాం. కామెడీ, డ్రామా, హ్యుమర్‌, సాంగ్స్‌ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌ అద్భుతంగా వచ్చాయి.
కొన్ని టైటిల్స్‌ అనుకున్నాం కానీ సరిగ్గా సెట్‌ కాలేదు. అలాంటి సమయంలో నరేష్‌ ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌ సూచించారు. నిజానికి ఈ కథకు యాప్ట్‌ టైటిల్‌ ఇది. ఇందులో హీరోని అందరూ పెళ్లి ఎప్పుడని అడుగుతుంటారు. దీంతో ఇరిటేషన్‌లో హీరో పలికే సహజమైన డైలాగ్‌ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ టైటిల్‌ పెట్టడం పెద్ద బాధ్యత. ఈవీవీగారి క్లాసిక్‌ సినిమా అది. సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలై టైటిల్‌ వాడుకోవచ్చని పర్మిషన్‌ ఇచ్చారు.
చాలా కాలం తర్వాత ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో మేం ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది తప్పకుండా హిట్‌ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం.

Spread the love