దొడ్డి కొమరయ్య ఆశయ స్ఫూర్తితో ఉద్యమిస్తాం

– చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ గొరెంకల నర్సింహ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య ఆశయాల స్పూర్తితో ఉద్యమిస్తామని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వినర్‌ గోరెంకల నర్సింహ్మా అన్నారు. ఇబ్రహీంపట్నంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ అధ్వర్యంలో దొడ్డి కొమరయ్య వర్థంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో హైదరాబాద్‌ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్‌ ఆలీ ఖాన్‌ మొదలుకుని, స్థానిక జాగిర్దారులు, దేశ్‌ ముకులు, భూస్వాముల నుండి విముక్తి కోసం 1946 నుంచి 1948 వరకు తెలంగాణా సాయుధ పోరాటం జరిగిందన్నారు. విసునూర్‌ దేశ్‌ముఖ్‌ రామచంద్రా రెడ్డి తల్లి జానకమ్మా దొరసానిగా పెత్తనం చెలాయించిందన్నారు. కడికవెండిలో ఆమె ప్రజల పట్ల అతి క్రూరంగా వ్యవహరించేదని చెప్పారు. మనషులను వెట్టిచాకిరి చేయించడం, వడ్డీలు వసూలు చేయడం, రకరకాల శిక్షలు, జరిమానాలు విధించడంలో పేరుగాంచిందన్నారు. వెట్టిచాకిరి, దొపిడికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట జరుగుతున్న సమయంలో ఆంద్ర మహాసభ నాయకత్వం కడివెండిలో ఆంధ్ర మహాసభ సందేశాన్ని ప్రజలకు వినిపించారన్నారు. దొరలు, విసునూర్‌ల ఆటలను అరికట్టారన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్య్రం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేక పోయారన్నారు. దేశమంతటా స్వాతంత్య్రోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుతుంటే, నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా ఏకమై కర్రలు, బడిశెలు, గునపాలు అందుకుని విసునూర్‌, నిజాం, రజాకర్లకు వ్యతిరేకంగాపెద్ద ఎత్తున ప్రదర్శణ నిర్వహించారన్నారు. విసునూర్‌ తుపాకి తూటాలకు దొడ్డి కొమరయ్య అమరుడయ్యాడన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ విప్లవ పోరాటంలో ఆయన మరణం చెరగని ముద్రవేసు కుందన్నారు. అతని మరణవార్త ఆంధ్రమహాసభ కార్యకర్తలందరకీ తెగింపును, పోరాట స్పూర్తిని పెంచిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వృత్తిదారుల బతుకులు మరతాయనుకుంటే ఎలాంటి మర్పు లేదని విమర్శించారు. గోర్లు, బర్లు, చేపలు, కరెంటు ఉచితంగా ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. పెద్ద పెద్ద కార్పోరేట్‌ సంస్థలకు మాత్రం లక్షల కోట్ల రూపాయలు అప్పనంగా అప్పగిస్తున్నారని మండిపడ్డారు. సేవ వత్తులకు లక్ష రూపాయల ఉచితంగా ఇస్తున్నామని చెప్పుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కొద్ది దరఖాస్తులు పెట్టుకున్నారన్నారు. కానీ ఉరికి ఒకటి రెండు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దరఖాస్తు పెట్టుకున్న అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే వత్తిదారులను ఐక్యం చేసి దొడ్డి కొమరయ్య పోరాట స్పూర్తితో ఉద్యమిస్తమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పల్లపు విగేష్‌, గొర్రెల మేకల పెంపకం దార్ల సంఘం జిల్లా కార్యదర్శి అమీర్‌ పేట్‌ మల్లెష్‌, పి.వెంకటేష్‌,జె.దాస్‌,డి.జంగయ్య పాల్గొన్నారు.

Spread the love