‘ఆరోగ్యశ్రీ’ సేవలు నిలిపివేస్తాం..

నవతెలంగాణ-హైదరాబాద్ : రోగులకు అందించిన చికిత్సలకు తగ్గట్లు ఫీజుల చెల్లింపుల్లో జాప్యాన్ని, ప్యాకేజీ ధరలను పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 29వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద కొత్త కేసులను చూసేది లేదని ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆశా) వెల్లడించింది. న్యాయపరమైన తమ డిమాండ్లను ఆమోదించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వంలో కనిపించకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ప్రకటించింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) కింద కూడా వైద్య సేవలు అందించలేమని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘మా డిమాండ్ల పరిష్కారం కోసం ఈ ఏడాది జూన్‌, నవంబరు మాసాల్లో సేవలు నిలిపివేస్తామని ఆశా ప్రకటించిన తరవాత చర్చలు జరిపి ఈ సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు రోగులకు ప్రైవేటు ఆసుపత్రులు యథావిధిగా సేవలు కొనసాగించాయి. గత నెలలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి సానుకూల చర్యలు లేనందున ఈ నెల 29 నుంచి వైద్యసేవలు నిలిపివేయాలని నిర్ణయించాం. ఈ మేరకు లేఖను 22వ తేదీన ప్రభుత్వానికి అందజేశాం’ అని ఆశా ప్రకటించింది.

Spread the love