దేశానికి అవసరం సీపీఐ(ఎం), వామపక్ష అభ్యర్ధుల గెలుపు

– రాజ్యాంగం, లౌకిక, ప్రజాస్వామ్య, సమాఖ్య వ్యవస్థలకు భరోసా
– బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం
– ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఎర్రజెండా
నవతెలంగాణ న్యూఢిల్లీ ప్రతినిధి
లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ(ఎం), వామపక్షాల గెలుపు దేశానికి అవసరం. లౌకిక, ప్రజాస్వామ్య వాదులకు అవ సరం. కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన, మహిళ, పేద వర్గాలకు అవసరం. బుద్ధి జీవులకు అవసరం. దళిత, ఆది వాసీ, వెనుకబడిన వర్గాలకు అవసరం.సీపీఐ(ఎం), వామ పక్షాలు నిరంతరం ప్రజా, దేశ ప్రయోజనాల కోసమే పోరాడుతున్నాయి. రాజ్యాంగ, ప్రజాస్వామ్య, లౌకిక, సమాఖ్య వ్యవస్థ పరిరక్షణకు ఉద్యమిస్తున్నాయి. ప్రజలు ఆపదలో ఉన్నారంటే, అన్యాయానికి గురవుతున్నారంటే అక్కడ కనిపించేది ఎర్ర జెండా మాత్రమే. మోడీ సర్కార్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీ లేని పోరాటం చేస్తున్నాయి.
బుల్డోజ్‌రాజ్‌పై ప్రతిఘటన
2023 ఏప్రిల్‌ 16 ఉదయం 9.30. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్‌ ఢిల్లీ గోల్‌ మార్కెట్‌లోని ఏకేజీ భవన్‌కు చేరుకుని న్యాయవాదులతో మాట్లాడిన అనంతరం తొలుత జహంగీర్‌పురి వెళ్లారు. అక్రమ భవనాల తొలగింపు పేరిట ముస్లిం దుకాణాలను కూల్చివేస్తున్నారని సమాచారం తెలిసింది. సుప్రీంకోర్టు స్టే విధించినప్పటికీ ఢిల్లీ మున్సిపల్‌ కమిషనర్‌, ఢిల్లీ నార్త్‌ పోలీస్‌ కమిషనర్‌ సారధ్యంలో కూల్చివేతలు కొనసాగడం అక్కడ కనిపించింది. బృందాకరత్‌ బుల్డోజర్ల ముందు నిలబడి చేతులు పైకెత్తి బిగ్గరగా అరిచారు. రోకో..! సుప్రీమ్‌ కోర్ట్‌ కా ఆర్డర్‌ హై…’ (ఆపండి… సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్‌ ఉంది) అంటూ బుల్డోజర్‌ను అడ్డగిస్తూ అడ్డం నించున్నారు. ఆ చిత్రం నాడు సోషల్‌ మీడియాలో, ప్రధాన మీడియాలో వైరల్‌ అయింది. పార్లమెంటు లోపలా, వెలుపలా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పడంలో సీపీఐ(ఎం), వామపక్షాలు ఎప్పుడూ ముందుంటాయని ఈ సన్నివేశం స్పష్టం చేసింది.
పాలస్తీనా అయినా.. కాశ్మీర్‌ అయినా..
అమెరికా, నాటో దళాల ప్రోద్బలంతో ఇజ్రాయిల్‌ పాలస్తీనాపై దాడులు చేస్తున్న సమయంలో బాధిత పాలస్తీనా ప్రజలకు సంఘీభావ ర్యాలీలు, మన దేశంలో మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించేందుకు మోడీ సర్కారు తెచ్చిన సీఏఏఏకు నిరసనగా పోరాటం, ఎలక్టోరల్‌ బాండ్‌ స్కీమ్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సవాల్‌, గెలుపు…సీపీఐ(ఎం), వామపక్షాలే ఈ అంశాలను చేపట్టాయి. సీపీఐ(ఎం), వామపక్షాలు పార్లమెంట్‌లో బలమైన ప్రతిపక్షంగా ఉంటేనే, నిర్ణయాత్మక పాత్ర పోషిస్తేనే, రాజకీయాలపై కార్పొరేట్ల పట్టుకు అడ్డుకట్ట పడుతుంది. ఆర్టికల్‌ 370ని మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయడంతో మత కలహాలు చెలరేగిన జమ్మూ కాశ్మీర్‌, మణిపూర్‌లలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పర్యటించాకనే అక్కడి వాస్తవ పరిస్థితులు లోకా నికి విదితమయ్యాయి. మణిపూర్‌లోని సహాయ శిబి రాలను సందర్శించి, బీజేపీ ‘డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం’ విఫలమైందని దేశ ప్రజలకు సీపీఐ(ఎం) బృందం పర్య టించి తెలియ జేసింది. మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, మతోన్మాద కుట్రలను పార్లమెంటులో వ్యతి రేకించే తమ వైఖరిలో వామపక్షాలు రాజీపడలేదు. లోక్‌ సభ, రాజ్యసభల్లో ప్రజాస్వామ్య విధ్వంసాన్ని ఎండగడుతూ ప్రజా సమస్యలపై ఎలుగెత్తడంలో వామపక్ష ఎంపీిలు ముందున్నారు. 2019లో మోడీ ప్రభుత్వం యూఏపీఏకు తీసుకొచ్చిన సవరణలకు వ్యతిరేకంగా నిలబడ్డారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను వామపక్ష ఎంపీలు చట్ట సభల్లో లేవనెత్తారు.
ప్రజా ఉద్యమాలు..పార్లమెంట్‌లో నిలదీతలు… న్యాయపోరాటాలు…
ప్రజా ఆందోళనలు, పార్లమెంటులో జోక్యాలే కాకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు వామపక్షాలు బలమైన న్యాయపోరాటాలు చేశాయి.
ఆదివాసీల హక్కులు, దళిత, మైనార్టీలపై దాడులపై సీపీఐ(ఎం), వామపక్షాలు పోరాడు తున్నాయి. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలనే ఆందోళనలో రైతులతో కలిసి సీపీఐ(ఎం) అగ్రభాగాన ఉంది. పార్ల మెంట్‌లో వామపక్ష ఎంపీలు రైతుల గొంతు కయ్యారు.
చారిత్రాత్మక ఉద్యమంతో మోడీ సర్కారు వ్యవసాయ చట్టాల రద్దుకు దిగి రావాల్సి వచ్చింది. ఎలక్టోరల్‌ బాండ్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును సీపీఐ(ఎం) రెండుసార్లు ఆశ్రయించింది. కేసు విచారణ సందర్భంగా.. ‘దీని ద్వారా మీకు నిధులు రావడం లేదా’ అని కోర్టు ప్రశ్నించగా.. ‘దీని ద్వారా మాకు ఒక్క రూపాయి కూడా అక్కర్లేదు’ అని సీపీఐ(ఎం) గట్టిగా సమాధానం ఇచ్చింది.ఎలక్టోరల్‌ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు తీర్పు సీపీఐ(ఎం)కు గుర్తింపు తెచ్చింది. బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలపై సీపీఐ(ఎం) నేత ..బృందాకరత్‌ దాఖలు చేసిన పిటిషన్లు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన తొలి రాష్ట్రం ఎల్‌డీఎఫ్‌ పాలిత కేరళ. రాష్ట్రాల హక్కులు, అసెంబ్లీ చేసిన బిల్లులను గవర్నర్‌ నిలుపుదల చేయడం పైనా కేరళ ప్రభుత్వం సుప్రీంలో సవాల్‌ చేసింది. ఉత్తర భారతదేశంలో గో హత్యలు జరిగిన ప్రాంతాల్లో ఈశాన్య ఢిల్లీలో అల్లర్లకు గురైన ప్రాంతాలలో, క్రైస్తవులపై హింస జరిగిన ఛత్తీస్‌గఢ్‌లో ఆ గాయాలను మాన్చడానికి సీపీఐ(ఎం), వామపక్షాలు తీవ్రంగా కృషి చేశాయి.

Spread the love