రేషన్‌కార్డులెప్పుడిస్తరు?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకానికైనా అర్హత ఉండాలంటే రేషన్‌ కార్డు తప్పనిసరి. అలాంటి రేషన్‌కార్డు కోసం పేదలు ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇప్పుడిస్తాం… అప్పుడిస్తాం అంటూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం మూలానా ప్రజలు అనేక పథకాలకు దూరమవుతున్నారు. ఇబ్బందులకు కూడా గురవుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిందేడ్లు అవుతున్నా ఏ ఒక్క కుటుంబానికి రేషన్‌ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు. ప్రతి సంవత్సరం కుటుంబాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ రేషన్‌ కార్డుల సంఖ్య మాత్రం పెరగటం లేదు. ప్రభుత్వం ఏర్పడిన ఈ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది నూతనంగా వివాహం చేసుకున్నారు. వారికి సంతానం కూడా కలిగింది. పెళ్లి తర్వాత ఉమ్మడి కుటుంబం నుండి విడిపడిన కుటుంబాలు కూడా అనేకం ఉన్నాయి. కాని వారికి నేటికీ రేషన్‌ కార్డులు లేవు. రేషన్‌ కార్డు కావాలని తహసీల్దార్‌ కార్యాలయం, మీసేవా కేంద్రాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. కొత్తగా పెండ్లి చేసుకున్నవారికి పిల్లలు పుట్టి సంవత్సరాలు గడుస్తున్నా రేషన్‌కార్డులందకపోవడం శోచనీయం. ప్రభుత్వ పథకాలైన రేషన్‌ బియ్యం, పలు సబ్సిడీ స్కీమ్‌లు, విద్యార్థుల స్కాలర్‌ షిప్‌లు, ఫ్యామిలీ, ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌, బీసీ రుణాలు, దళిత బంధు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, ఎస్సీ, ఎస్టీ రుణాలు ఇవి గాక అనేకం ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే అవసరాలకు రేషన్‌కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటోంది. కార్డులేక ఎంతోమంది అనేక అవస్థలకు గురవుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం రేషన్‌కార్డుల ప్రాధాన్యతను అర్థం చేసుకుని అర్హులైన పేదలందరికీ కార్డులు మంజూరు చేయాలి,
– మట్టిపెల్లి సైదులు, 8106778287

Spread the love