– నేటికీ కాలం చెల్లిన లెక్కలే ఆధారం
న్యూఢిల్లీ : కులగణన జరిపే అధికారం రాష్ట్రానికి లేదంటూ ఇటీవల పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పు నితీశ్ కుమార్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా భావించవచ్చు. ఎందుకంటే రూ. 115 కోట్ల వ్యయంతో జనవరి 7న బీహార్ ప్రభుత్వం ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కులగణన చేసే అధికారం ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. దేశంలో కులాలపై సర్వే జరపడం 1931 జనాభా లెక్కల సేకరణతోనే ప్రారంభమైంది. కులగణన సంగతి అటుంచితే జనాభా లెక్కల సేకరణను కూడా ఏ కారణం చేతనో కేంద్రం జరపడం లేదు. 2021లో జనాభా లెక్కలు సేకరించాల్సి ఉండగా ఆ పని నేటికీ జరగకపోవడంతో దేశం ఇప్పటికీ 2011 లెక్కల పైనే ఆధారపడాల్సి వస్తోంది.
ప్రతి పదేండ్లకు ఒకసారి జనాభా లెక్కలు సేకరించే ప్రక్రియను 1881లో ప్రారంభించారు. ఇప్పటి వరకూ అది వాయిదా పడలేదు. జాప్యం కూడా జరగలేదు. జనగణన కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని (ఓఆర్‌జీఐ) ప్రారంభించారు. జనగణన అనేది పెద్ద ఎత్తున చేపట్టే కసరత్తు. ఇరవై నుండి ముప్ఫై లక్షల మంది ఎన్యూమరేటర్లు గడపగడపకూ వెళ్లి వ్యక్తిగత, కుటుంబ సమాచారాన్ని సేకరిస్తారు. విద్య, అక్షరాస్యత స్థాయి, గృహవసతి, సంతానం, సౌకర్యాలు, వలస, భాష, ప్రాంతం, కులం…ఇలా అనేక వివరాలు తెలుసుకుంటారు. ప్రజల అవసరాలు తెలుసుకోవడానికి, ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వివరాలు చాలా అవసరం. 2021 జనగణనకు సంబంధించి 2019లో ప్రణాళికలు రూపొందించారు. రూ. 8,754 కోట్ల బడ్జెట్‌ను సైతం కేటాయించారు. మొట్టమొదటిసారిగా డిజిటల్ పద్ధతిలో సమాచార సేకరణ జరపాలని నిర్ణయించారు. అయితే కోవిడ్ కారణంగా ఈ ప్రక్రియను నిరవధికంగా వాయిదా వేశారు. అనంతరం 2022 డిసెంబర్ 31 తర్వాత పని మొదలు పెట్టాలని భావించారు. ఈ తేదీని మరోసారి పొడిగించి ఈ సంవత్సరం జూలై 1వ తేదీగా నిర్ణయించారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ పని మొదలు పెట్టే అవకాశాలు కన్పించడం లేదు.
అసలు శాస్త్రీయ సమాచారం అంటేనే ఈ పాలకులకు కంపరంగా ఉంటోంది. ఓబీసీల సంఖ్య, మైనారిటీలలో సంతానోత్పత్తి రేటు వంటి అంశాలపై బీజేపీ వాదనలు వాస్తవానికి భిన్నంగా ఉన్నాయి. జనగణన చేస్తే ఆర్థికాభివృద్ధి విషయంలో ఆ పార్టీ నేతలు చెబుతున్న మాటలలో డొల్లతనం బయటపడుతుంది. పేదరిక నిర్మూలనపై శాస్త్రీయమైన సమాచారమేదీ.