పంట భూములపై ‘రియల్‌’ భూతం

–  మాయమాటలతో రైతులను మభ్యపెడుతున్న వైనం
– తక్కువ ధరకు అసైన్డ్‌ భూముల కొనుగోళ్లు
– అధికారుల మాయాజాలంతో భూములకు పట్టాలు
– రైతుల నుంచి చేజారుతున్న వ్యవసాయ భూములు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పచ్చని పంట భూములను రియల్‌ భూతం పట్టి పీడిస్తోంది. పేద రైతులనే టార్గెట్‌ చేసింది. ‘అసైన్డ్‌’ పేరును అడ్డుపెట్టుకుని రైతుల భూములు కాజేసే కుట్రలు జరుగుతున్నాయి. గతంలో ఎన్నో పోరాటాల ఫలితంగా నాటి ప్రభుత్వాలు పేదలకు అసైన్డ్‌ భూములు పంచాయి. ఈ భూములకు పట్టాలు కూడా వచ్చాయి. గీ భూములనే నమ్ముకుని రైతులు బతుకుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరుతో ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు ఈ భూములపై రియల్టర్ల కన్ను పడింది. ప్రభుత్వం తీసుకోకముందే తమకు భూములు అమ్మాలని రైతులను మభ్యపెడుతున్నారు. ఈ అసైన్డ్‌ భూములు పెద్దల చేతుల్లోకి వెళ్లాక అధికా రుల చేతివాటంతో పట్టా భూములుగా మారుతున్నాయి. రియల్టర్లకు కోట్లు కురిపిస్తు న్నాయి. రంగారెడ్డి జిల్లాలో రియల్టర్ల కబంధ హస్తాల్లో చిక్కిన సాగు భూములపై కథనం.
రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్‌ 44/అ/1, 44/ఆ/1లో సుమారు 10 ఎకరాల అసైన్డ్‌ భూమి ఉంది. ఈ భూమిని రైతుల నుంచి రియల్టర్లు కొనుగోలు చేశారు. ఆ వెంటనే భూమి పట్టా చేసు కున్నారు. అసైన్డ్‌ భూమిగా రికార్డుల్లో చూపిన భూములకు సాధారణ పట్టాలు వచ్చాయి. కొత్తూరు మండల పరిధిలోని పెంజర్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌ 22/1లో 20 ఎకరాలు, 255/2లో 32 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. ఇందులో 30 మంది రైతులకు ఎకరా చొప్పున ప్రభుత్వం భూమి అసైన్డ్‌ చేసింది. 1989లో కొంత భూమి 22బి కింద ప్రభుత్వం తీసుకుంది. అయితే, ఈ భూములను సాగుచేస్తున్న రైతులకు గతంలో అసైన్డ్‌తో పట్టాలు ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల్లో ఈ సర్వే నెంబర్ల భూములు పేదలకు అసైన్డ్‌ చేసినట్టు చూపుతున్నాయి. అయితే, ధరణి పోర్టల్‌ వచ్చిన తరువాత కొత్త పాసు పుస్తకాలు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. ఇదే అదునుగా రాజకీయ పలుకుబడి, ప్రభుత్వ అండదండాలు ఉన్న రియల్‌ వ్యాపారులు రైతులకు నయానో.. భయానో ఇచ్చి ఈ భూములు కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారు.
షాబాద్‌ మండల పరిధిలోని చందనవల్లి రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం పేదలకు అసైన్డ్‌ భూములు ఇచ్చింది. ఈ భూములను ప్రభుత్వం తిరిగి లాక్కుంటుందని తెలిసి రియల్‌ వ్యాపారులు రైతులను మభ్యపెట్టి ఎకరాకు రూ.20 లక్షల చొప్పన ఇచ్చి 25 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇక్కడ ఎకరా భూమి సుమారు రూ.మూడు కోట్లు ఉంది. ఇలా మొయినాబాద్‌, శంకర్‌పల్లి, అబ్దులాపూర్‌మెట్‌, ఇబ్రహీం పట్నం, షాద్‌నగర్‌లో వందలాది ఎకరాల భూములను పేదల నుంచి తక్కువ ధరకు రియల్‌ వ్యాపారులు కొనుగోలు చేస్తూ రూ.కోట్లు గడిస్తున్న పరిస్థితి. అయితే, ఈ తతంగం అంతా పాలక రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో జరుగుతుందన్న చర్చ జిల్లాలో జోరుగా వినిపిస్తోంది. రైతుల చేతుల్లో ఉన్న అసైన్డ్‌ భూములు రియల్‌ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లగానే పట్టాలుగా మారుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి పేదల భూములను రియల్టర్ల నుంచి కాపాడాలని, అసైన్డ్‌ భూములకు రైతులకే పట్టాలు ఇవ్వాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి.
అసైన్డ్‌ భూములకు పట్టాలివ్వాలి
పేద రైతుల జీవనాధారం కోసం ఎన్నో పోరాటాల ఫలితంగా నాటి ప్రభుత్వాలు పేదలకు అసైన్డ్‌ భూములు ఇచ్చాయి. వాటికి పట్టాలు ఇవ్వాలి. అసైన్డ్‌ భూముల పేరుతో రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కాజేస్తూ కోట్లు గడిస్తున్న రియల్‌ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి.
కాడిగళ్ల భాస్కర్‌, సీపీఐ(ఎం)
రంగారెడ్డి జిల్లా కార్యదర్శి.

Spread the love