పంచాయతీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి

–  పాలడుగు భాస్కర్‌, అబ్బాస్‌
నవతెలంగాణ-భువనగిరిరూరల్‌
పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గ్రామపంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాలడుగు భాస్కర్‌, ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్‌ డిమాండ్‌ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల పర్మినెంట్‌, వేతనాల పెంపు, పెండింగ్‌ బకాయిల చెల్లింపు, మల్టీపర్పస్‌ వర్క్‌ విధానం రద్దు, కారోబార్‌ బిల్‌ కలెక్టర్లకు స్పెషల్‌ స్టేటస్‌ కల్పించాలనే డిమాండ్ల సాధనకై ఫిబ్రవరి 12 నుంచి జనగామ జిల్లా పాలకుర్తి నుంచి పట్నం వరకు చేపట్టిన జీపీ కార్మికుల యాత్ర శనివారం భువనగిరి మండలం లోని రాయగిరికి చేరుకుంది. పాదయాత్రకు ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్‌ సంఘీభావం తెలిపారు. పులిగిల్ల నుంచి రాయగిరి వరకు 19 కిలోమీటర్లు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌, అబ్బాస్‌ మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఏడు నెలలుగా పంచాయతీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కారోబార్‌, బిల్‌ కలెక్టర్లకు ప్రమోషన్లు కల్పించి కార్యదర్శులుగా నియమించాలని కోరారు. స్పెషల్‌ స్టేటస్‌ కల్పించాలని, రాష్ట్రంలో మున్సిపల్‌ కార్మికులకు చెల్లిస్తున్న రూ.15,600 వేతనాన్ని పంచాయతీ కార్మి కులకు కూడా చెల్లించాలని కోరారు. పంచాయతీ కార్మికులు చేపట్టే ఆందోళన, పోరాటాలలో ఆవాజ్‌ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ప్రత్యక్ష పోరాటాల్లో వారికి మద్దతుగా నిలుస్తామని చెప్పారు. అనంతరం యాత్రకు సీఐటీయూ హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా కార్యదర్శి మీసాల శ్రవణ్‌కుమార్‌ సంఘీభావం తెలిపారు.
యాత్రకు భువనగిరి మండలం ప్రాంతంలోని వివిధ కార్మిక సంఘాలు, హమాలీ యూనియన్‌ నాయకులు కృష్ణయ్య, అంజయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు, కారోబార్‌ పద్మారావు, రాము, శ్రీను, సంజీవ, మహేందర్‌ పాదయాత్రకు సంపూర్ణ మద్దతు తెలిపారు. యాత్రలో సీఐటీయూ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి, పంచాయతీ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి పాండు, జిల్లా నాయకులు తదిరులు పాల్గొన్నారు.

Spread the love