గ్రామ పంచాయతీ కార్మికుల్ని పర్మినెంట్‌ చేయాలి

–  మంత్రి ఎర్రబెల్లికి పాలడుగు భాస్కర్‌ బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల్ని పర్మినెంట్‌ చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) గౌరవాధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కారోబార్‌, బిల్‌కలెక్టర్లకు స్పెషల్‌ స్టేటస్‌ కల్పించాలని కోరారు. మల్టీ పర్పస్‌ వర్కర్‌ విధానాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. కనీస వేతనం రూ.26,000లు నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. పాదయాత్ర చేస్తున్న క్రమంలో కార్మికుల నుంచి వచ్చిన వినతులను జోడిస్తూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఆయన మంగళవారం బహిరంగ లేఖ రాశారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర బృందంతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. పాలకుర్తి, దేవరుప్పల, లింగాల గణపురం మండలాల్లోని 89 పంచాయతీల్లో 298 మంది కార్మికులు పనిచేస్తుంటే వేతనాలు మాత్రం 204 మందికే ఇస్తున్నారనీ, కొత్తవారికి ఇవ్వట్లేదని తెలిపారు. 204 మందికి ఇస్తున్న జీతాన్ని 298 మంది పంచుకుంటున్నారనీ, దీంతో వారికి నాలుగైదు వేల రూపాయలకు మించి దక్కటం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దేవరుప్పుల మండలంలోని శీత్యా, లక్ష్మణ, పడమటి తండాల్లో సర్పంచులు పంచాయతీ కార్మికులను బెదిరించడం దారుణమని పేర్కొన్నారు. లక్ష్మణ తండాలో ఒక్కరి జీతాన్ని ఇద్దరికి పంచడం దారుణమనీ, దీన్ని ఏడేండ్లుగా పనిచేస్తున్న ఓ కార్మికుడు ప్రశ్నిస్తే అతన్ని విధుల్లో నుంచి తీసేశారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ధర్మాపురం చుట్టుపక్కల పంచాయతీలలో పాత కార్మికులను తొలగించి సర్పంచులకు సంబంధించిన కుటుంబ సభ్యులను నియమించుకున్నారని తెలిపారు. ఆ మూడు మండలాల్లో ఏడు నెలలుగా కార్మికుల వేతనాలు పెండింగ్‌లో పెట్టారనీ, జీతాల్లే కుండా వారు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నియోజక వర్గంలోనే ఈ విధమైన సమస్యలతో కార్మికులు కొట్టుమిట్టాడటం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. పాలకుర్తి, దేవరుప్పులు, లింగాల ఘనపూర్‌ మండల కేంద్రాల్లో ఒక్క గ్రామ పంచాయతీ కార్మికుడికి కూడా డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్లు కేటాయించలేదని వాపోయారు. వాటిలో కొన్నింటిని పంచాయతీ కార్మికులను కేటాయించాలని కోరారు. కలెక్టర్‌, డీపీఓ, పంచాయతీ రాజ్‌ శాఖ అధికారుల సమ క్షంలో కార్మికులతో చర్చించి వారి సమస్యలు పరిష్కరించాలని ఆ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

Spread the love