పారిశుధ్య కార్మికుల జీతాలు అరకొర..

– పాదయాత్ర ముగియక ముందే చర్చలకు పిలువండి.. : గ్రామ పంచాయతీ కార్మికుల పాదయాత్రలో పాలడుగు భాస్కర్‌
– సమస్యలు వివరించిన కార్మికులు
నవతెలంగాణ-దేవరుప్పుల
తెలంగాణలో గ్రామపంచాయతీ కార్మికులకు రూ.4000 వేతనం ఇవ్వడం సిగ్గుచేటని, అరకొర జీతాలతో కుటుంబాలను ఎలా నెట్టుకొస్తారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక వైపు పల్లె ప్రకృతి వనాల శుభ్రత.. మరోవైపు మోరీల సఫాయి, కుళ్ళిన కుక్కల శవాల తరలింపు లాంటి పనులన్నీ పంచాయతీ కార్మికుల వల్ల సాధ్యమేనా అని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్ర రెండవ రోజు సోమవారం దేవరుప్పుల మండలంలో కొనసాగింది. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు అధ్యక్షతన ముందుగా ధర్మపురం గ్రామంలో సాయుధ పోరాట యోధులు దుర్గ్యానాయక్‌ను కలిసి పోరాట స్ఫూర్తి విషయాలను తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని షేక్‌ బందగీ స్తూపానికి, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. కరోనా సమయంలో మనిషికి మనిషికి సంబంధం లేకుండా జీవించిన తరుణంలోనూ గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలకు చేసిన సేవలు, శ్రమ, మానవత్వంను కొనియాడారు. కరోనా సమయంలో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు ప్రతేడాది దుస్తులతో పాటు మాస్కులు, గ్లౌజులు, తోపుడు బండ్లు అందించాలన్నారు. మల్టీ పర్పస్‌ విధానాన్ని రద్దుచేసి కారోబార్‌, బిల్‌ కలెక్టర్‌ ప్రత్యేక హోదా కల్పించాలని కోరారు. మేజర్‌ గ్రామ పంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా, చిన్న గ్రామ పంచాయతీ కార్మికులకు ఏడు నెలలుగా వేతనాలు రాక పోవడంతో వారి కుటుంబాలు గడవడం కష్టంగా మారా యని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిధులు విడుదల చేసి, వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలాగే, ఆరోగ్య బీమా కల్పించాలని, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, దళిత బంధు పథకంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, పాదయాత్ర సాయంత్రం వరకు మండలంలోని సింగరాజుపల్లి వరకు చేరుకుంది. పాదయాత్రలో ఒక చోట పాలడుగు భాస్కర్‌ చెత్తను తీసుకెళ్లే రిక్షాను తొక్కారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు తమ సమస్యలను పాద యాత్ర బృందానికి వివరించారు. పాదయాత్రలో గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు గ్యార పాండు, చాగంటి వెంకటయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గణపతి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు తునికి మహేష్‌, వినోద్‌ కుమార్‌ జనగామ జిల్లా అధ్యక్షులు బత్తిని వెంకన్న, మండల అధ్యక్షకార్యదర్శులు రామచందర్‌, గనగాని ఉప్పలయ్య, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love