ప్రతి కేసులో శిక్షలు పడేలా చూడాలి

– దర్యాప్తు అధికారులకు సీఐడీ డీజీ సూచన
నవతెలంగాణ – ప్రత్యేక ప్రతినిధి : తాము జరిపే కేసుల దర్యాప్తుల్లో నిందితులకు కచ్చితంగా శిక్షలు పడేలా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని దర్యాప్తు అధికారులకు సీఐడీ డీజీ మహేశ్‌ భగవత్‌ సూచించారు. సీఐడీ విభాగం అధిపతిగా బాధ్యతలు స్వీకరించాక తమ శాఖలో జరుగుతున్న వివిధ కేసుల దర్యాప్తుల తీరు తెన్నులపై ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. సీఐడీ శాఖకు పోలీసు శాఖలో క్లిష్టతరమైన కేసుల దర్యాప్తులో ఆరితేరిన విభాగంగా పేరున్నదనీ, ఆ ప్రతిష్టను దిగజారనివ్వరాదని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా, ప్రభుత్వం వైపు నుంచి కూడా పలు కేసులు దర్యాప్తు నిమిత్తం సిఫారసు చేయబడతాయనీ, దాని అర్థం సీఐడీ విభాగం ఆ కేసులలో నిగ్గు తేలుస్తుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో సీఐడీ విభాగంలోని వివిధ దర్యాప్తు అధికారుల పరిశీలనలో ఉన్న కేసులలో ఎన్ని కేసులు దర్యాప్తు పూర్తయ్యాయి? ఎన్ని కేసులలో కోర్టులలో చార్జీషీట్లు దాఖలయ్యాయి? మరెన్ని కేసులలో న్యాయస్థానాలలో ట్రయల్‌ సాగుతుంది? తదితర అంశాలపై ఆయన దృష్టిని సారించారు. సీఐడీలో విచారణ సాగుతున్న దాదాపు అన్ని కేసులలో నిందితులకు శిక్షలు పడేలా చేయడానికి అవసరమైన సాక్షాలు, ఆధారాలు, సైంటిఫిక్‌ ఎవిడెన్సులను కచ్చితంగా సేకరించాలనీ ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

Spread the love