నవతెలంగాణ- హైదరాబాద్: ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులు చేస్తూ యుద్ధాన్ని ఆ దేశం వైపు మళ్లించింది. కానీ ఇప్పుడు మళ్లీ కథ మొదటికి వచ్చింది. ఉక్రెయిన్‌పై తాజాగా రష్యా దాడికి తెగబడింది. ఈ దాడుల్లో 48 మంది దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఖర్కీవ్ ప్రాంతంలోని హ్రోజా గ్రామంలో ఒక దుకాణం, కేఫ్‌పై రష్యా బలగాలు గురువారం మధ్యాహ్నం దాడులు చేశాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో 48 మంది మరణించారని.. మృతుల్లో ఆరేళ్ల బాలుడు కూడా ఉన్నాడని వెల్లడించారు. మరోవైపు రష్యా దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ధ్రువీకరించారు. రష్యన్ రాకెట్ దాడి క్రూరమైన నేరమని.. ఇది ఉద్దేశపూర్వకంగా జరిపిన ఉగ్రవాద దాడి అని జెలెన్‌స్కీ అన్నారు.