9న క్యాబినెట్‌ భేటి

– గవర్నర్‌, సీఎస్‌ వివాదం చర్చకు వచ్చే అవకాశం ?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్‌
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల తొమ్మిదిన జరగనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు క్యాబినెట్‌ భేటి కానుంది. ఈ సమావేశానికి మంత్రులు, ప్రభు త్వ ప్రధానకార్యదర్శి, ఇతర ఉన్న తాధికారులు హాజరు కానున్నారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి మంత్రిమండలి నిర్ణయాలు తీసుకోనుందని శనివారం సీఎంవో ఒక ప్రకటనలో తెలిసింది. అయితే రాష్ట్ర గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారిపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ దగ్గరగా ఉందంటూ, సీఎస్‌ అయిన తర్వాత కనీసం ప్రోటోకాల్‌ కూడా పాటించరా ? అంటూ ట్వీట్‌ చేసిన విషయం విదితమే. దీనిపై ప్రభుత్వంతోపాటు ఐఏఎస్‌ల్లోనూ చర్చకు దారితీసింది. ఈనేపథ్యంలో ఆ అంశం సైతం మంత్రివర్గంలో చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసిన దాదాపు 10 బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి రాజ్‌భవన్‌లో పెండింగ్‌ పెట్టిన నేపథ్యంలో సీఎస్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడమే వివాదానికి కారణం కావడం గమనార్హం.

Spread the love