Sunday, February 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకులరహిత ప్రత్యామ్నాయ సాంస్కృతికోద్యమాన్ని నిర్మించాలి

కులరహిత ప్రత్యామ్నాయ సాంస్కృతికోద్యమాన్ని నిర్మించాలి

- Advertisement -

కుల, మతాంతర వివాహితులను..ఆదర్శ భారతీయులుగా గుర్తించాలి
ఆదర్శ దంపతుల అభినందన సభలో ఓయూ ప్రొఫెసర్‌ చింతకింది కాశీం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కులం, మతం వేళ్లూనుకొని ఉన్న కాలంలో కాషాయ కాలుష్యం ప్రేమికుల హక్కులపై మూకదాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో కులరహిత ప్రత్యామ్నాయ సాంస్కృతికోద్యమా న్ని నిర్మించాల్సిన అవసరముందని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ చింతకింది కాశీం పిలుపునిచ్చారు. తద్వారా మధ్యయుగాల కాలం నాటి మనస్తత్వం కలిగిన మనువాద శక్తులను ప్రతిఘటించి ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం పాటుపడాలని ఆయన సూచించారు. శనివారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం, కుల నిర్మూలనా సంఘం, మూఢ నమ్మకాల నిర్మూలనా సంఘం సంయుక్తాధ్వర్యంలో కుల, మతాంతర దంపతుల అభినందన సభను ఘనంగా నిర్వహించారు. ఈ సభకు కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ.స్కైలాబ్‌ బాబు అధ్యక్షత వహించారు. సభా కార్యక్రమానికి ముందు పుల్వామా అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా కాశీం మాట్లాడుతూ కుల, మతాంతర వివాహాలను ప్రోత్సహించటం ఒక సామాజిక బాధ్యతగా గుర్తించాలని కోరారు. ప్రపంచంలో ఎక్కడా లేని కులవ్యవస్థ మన దేశంలో ఉన్నదనీ, సాటి మనిషిని మనిషిగా చూడకుండా అవమానిస్తూ దాడులు, దౌర్జన్యాలు, హత్యలకు కారణం అవుతోందని తెలిపారు. ప్రేమ కులం, మతం ఎరగదనీ, ప్రేమించడం నేర్చుకోలేని వారే ద్వేషిస్తారని అన్నారు. కులరహిత సమాజానికి బాటలు వేయాలంటే కుల, మతాంతర వివాహాలు విరివిగా జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రకృతి పరిణామంలో కులం, మతం, ప్రాంతం వంటి అడ్డుగోడలు తెంచుకొని ప్రేమ వివాహాలు జరుగుతాయని వివరించారు. వేల సంవత్సరాల తప్పుడు సంస్కృతి కారణంగా మనుషుల మెదళ్లలో కలుషిత వ్యర్ధ ఆలోచనలు ప్రవహిస్తున్నాయనీ, వాటి ప్రభావాలు సమాజంలో విద్వేషాలకు, విధ్వంసాలకు, దాడులకు, దౌర్జన్యాలకు కారణమవుతున్నాయని చెప్పారు. కుల రహిత ప్రత్యామ్నాయ సంస్కృతి పూర్వ కాలం నుంచి కొనసాగుతోందన్నారు. మహాముని వశిష్టుడు మాదిగ కన్యను పెండ్లాడినట్టు, వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారిని మతాంతర వివాహం చేసుకున్నట్టు మన పూర్వీకులు బోధించారని గుర్తుచేశారు. నాడు లేని దాడులు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేటి కాలంలో ఎందుకు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. కుల, మతాంతర వివాహాలు సామాజిక అభ్యుదయానికి దేశ అభివృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు. భారత రాజ్యాంగం, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని పేర్కొంటున్నాయని చెప్పారు. కానీ, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వారు కుల నిర్మూలన కోసం కృషి చేయడం లేదని కాశీం విమర్శించారు. పైగా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను వాడుకుంటూ కుల వైషమ్యాలను పెంచుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించడానికి నాటి కాలంలో జ్యోతిబా ఫూలే, అంబేద్కర్‌ కమ్యూనిస్టులు, హేతువాదులు, నాస్తిక వాదులు కృషి కొనసాగించారని కొనియాడారు. నేటి యువతరం ఆ బాటలో పయనించాలని పిలుపునిచ్చారు.

అభినందన సభ తీర్మానాలు
ఈ అభినందన సభలో కుల నిర్మూలనా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ వహీద్‌ తీర్మానాలను ప్రవేశ పెట్టారు. ”కుల, మతాంతర వివాహాల పరిరక్షణకు ఒక సమగ్ర చట్టం తీసుకురావాలి. కుల దురహంకార హత్యలకు పాల్పడిన వారిని ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలి. కుల సమస్యను పాఠ్యాంశాల్లో చేర్చి కుల నిర్మూలనా మార్గాలను ప్రతిపాదించాలి. కుల నిర్మూలన జరగాలనే రాజ్యాంగ ఆకాంక్షను, రక్త సంక్రమణ జరగాలని అంబేద్కర్‌ చెప్పిన అంశాలను చేర్చి కుల రహిత సమాజానికి బాటలు వేయాలి. కుల, మతాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు జంటలకు ప్రభుత్వ ప్రోత్సాహకం రూ.10 లక్షలు ఇవ్వాలి. కుల, మతాంతర వివాహం చేసుకున్న వారిని ఆటంకపరిచే వారిని శిక్షించేలా కుల, మతాంతర వివాహితుల పరిరక్షణ చట్టం తేవాలి. అభివృద్ధితో పాటు పోటీపడుతూ పెరుగుతున్న కుల, దురహంకార హత్యల నివారణకు ఒక శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేయాలి. కుల, మతాంతర వివాహితులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు వీలుగా ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసి దానికి తగినన్ని నిధులు కేటాయించాలి. కుల, మతాంతర వివాహితుల సంతానాన్ని ఆదర్శ భారతీయులుగా గుర్తించి వారికి విద్య, ఉద్యోగాల్లో కనీసం 2 శాతం రిజర్వేషన్‌ కేటాయించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిలో ప్రాధాన్యతనివ్వాలి. కుల నిర్మూలన కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం కొంత స్థలాన్ని కేటాయించాలి. కులాంతర వివాహం చేసుకున్న వారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకంలో ప్రత్యేక కోటా కల్పించాలి. అదే విధంగా వారికి ఆదాయంతో నిమిత్తం లేకుండా ఉచితంగా వైద్య చికిత్సలు అందించాలి. రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో వారి కోసం ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలి” వంటి తీర్మానాలను అభినందన సభ ఆమోదించింది. అనంతరం కుల, మతాంతర వివాహం చేసుకున్న జంటలను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ సెక్రెటరీ ఎస్‌.వినయ కుమార్‌, మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బైరి నరేష్‌, టీపీఎస్కే రాష్ట్ర కన్వీనర్‌ జి.రాములు, నాయకులు భూపతి వెంకటేశ్వర్లు, కుల నిర్మూలన సంఘం గౌరవ అధ్యక్షురాలు గుత్తా జ్యోత్స్న, మానవ వికాస వేదిక అధ్యక్షులు సాంబశివరావు, ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎండీ అబ్బాస్‌లు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో కుల, మతాంతర వివాహం చేసుకున్న దంపతులు తాము ఎదుర్కొన్న ఇబ్బందులను సభ ముందుంచారు. అంబేద్కర్‌ ట్యూషన్‌ సెంటర్‌ విద్యార్థినీ, విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ, కుల నిర్మూలనపై నత్య రూపాన్ని ప్రదర్శించి సభను ఆకట్టుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -