దొడ్డిదారిన కేంద్ర నూతన విధానాల అమలు
ఐక్య ఉద్యమాల ద్వారానే ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలి
పూర్వ అధ్యక్షులు జంగయ్య ఉద్యోగ విరమణ సభలో టీఎస్‌యూటీఎఫ్
రాష్ట్ర అధ్యక్షులు చావ రవి
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
”ఎన్ఈపీ 2020 నూతన విద్యా విధానం పేరుతో బజారులో బడి లేకుండా చేస్తున్నారు.. ఐక్య ఉద్యమాల ద్వారానే ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలి.. ఒకవైపు నాణ్యమైన విద్యను నిరుపేదలకు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు బజారులో బడి లేకుండా చేస్తోంది..” అని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి అన్నారు.టీఎస్‌యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు కె.జంగయ్య ఉద్యోగ విరమణ అభినందన సభ సందర్భంగా శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని వెలమ ఫంక్షన్హాల్లో విద్యా గోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. ఒకవైపు ఉద్యోగం.. మరోవైపు ఉద్యమాల రథసారధిగా జంగయ్య పనిచేశారని అన్నారు. అదే సమయంలో ఆయన విధులు నిర్వహిస్తున్న తిమ్మాజిపేట పాఠశాలను అతిసుందరంగా నిర్మాణం చేయించి మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల సుమారు 93 వేల ప్రాథమిక పాఠశాలలను మూసేసి.. రెండు కోట్ల మందికి ఉచిత విద్యను దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాలను దొడ్డిదారిన ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వాటికి పరోక్షంగా మద్దతు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 లక్షల మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, పాఠశాలలను కుదించి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే వీరందరూ ఆయా గ్రామాల్లో ఉంటూ ఒకే పాఠశాలకు ఎలా వస్తారని ప్రశ్నించారు. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఒక ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఒక తరగతికి తప్పనిసరిగా ఒక టీచర్ ఉండాల్సిన నిబంధనను ఎందుకు పాటించడం లేదన్నారు. పిల్లలు ఉన్న చోట ఉపాధ్యాయులు లేరు.. ఉపాధ్యాయులు ఉన్న చోట పిల్లలు లేకుండా విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బడుగు బలహీన వర్గాలకు అందేలా ఉపాధ్యాయ సంఘాలు, పార్టీలు, ప్రజాసంఘాలు ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉచ్చులో పడి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేంద్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారొద్దని హితవు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ అయిన పది వేల ఉపాధ్యాయ పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా, ఓల్డ్ పెన్షన్ స్కీం అమలు చేయాలని కోరుతూ ఐక్య ఉద్యమాలు చేయాల్సి న అవసరం ఉందని పిలుపునిచ్చారు.ఆంధ్ర సారస్వత పరిషత్ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ మోత్కూరి నరహరి మాట్లాడుతూ.. పార్లమెంట్లో, రాజ్యసభలో ప్రతి సభ్యుని పైనా.. క్రిమినల్ కేసులు ఉన్నవారు మన ఏలికలుగా ఉన్నార ని ఆందోళన వ్యక్తం చేశారు. మాటిమాటికి సనాతన ధర్మం చెబుతున్న నాయకుల నోట అబద్ధాలు వస్తే సనాతన ధర్మం ఎలా అవుతుందని ప్రశ్నించారు. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారతీయులే అన్నప్పుడు మతాలకు స్థానం ఎక్కడ ఉందన్నా రు. బానిస సమాజం నుంచి మనలను విముక్తి చేసేది ఏకైక సాధనం ఒక్క విద్యనే అని చెప్పారు. ఉపాధ్యాయ రంగమంతా అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహతో ప్రతి ఉపాధ్యా యుడూ చైతన్యవంతంగా సమాజం కోసం కృషి చేయాలని సూచించారు.కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్, రాజశేఖర్ రెడ్డి, రవి, ప్రసాద్ గౌడ్, రవికుమార్, మోత్కూరి నరహరి, మాణిక్ రెడ్డి, కిష్టయ్య, రఘుపతి రెడ్డి, ఏపీ మల్లయ్య, రామదాస్, శ్రీధర్ శర్మ, కృష్ణ, పర్వతాలు, ఆర్.శ్రీనివాసులు, గీతమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఎన్ఈపీ 2020 అశాస్త్రీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



