రాష్ట్రాలకు షాక్‌!

– పేదల గృహాల కేటాయింపును
– రద్దు చేసిన కేంద్రం
– పీఎంఏవై-జే ఇండ్లన్నీ యూపీకే మళ్లింపు
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-గ్రామీణ్‌ (పీఎంఏవై-జేే) పథకం కింద పలు రాష్ట్రాలకు జరిపిన గృహ కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పన్నెండు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జరిపిన 1.44 లక్షల గృహ కేటాయింపులను ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. పైగా వాటన్నింటినీ ఉత్తరప్రదేశ్‌కు అదనంగా కేటాయించింది. రాజకీయ ప్రయోజనాల కోసం లోక్‌సభ ఎన్నికలకు ముందే… అంటే 2024 మార్చి నాటికి ఈ పథకం కింద వివిధ రాష్ట్రాలలో పేదలకు 2.95 కోట్ల నివాస గృహాలు నిర్మించి ఇవ్వాలని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే గడువు తేదీ అయిన జూన్‌ 30 లోగా నివాస గృహాలను మంజూరు చేయడంలో విఫలమయ్యా యన్న సాకు చూపి ఆయా రాష్ట్రాలకు జరిపిన కేటాయింపులను రద్దు చేసి ఆ నిధులన్నీ యూపీకి మళ్లించింది. పథకాన్ని పర్యవేక్షిస్తున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ విషయాన్ని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలియజేసింది. గుజరాత్‌, త్రిపుర, ఒడిషా, సిక్కిం, మేఘాలయ, మహారాష్ట్ర, అస్సాం, నాగాలాండ్‌, మిజోరం, తమిళనాడు, అండమాన్‌ నికోబార్‌ దీవులు, అరుణాచల్‌ ప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, లఢక్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కేరళ, జార్ఖండ్‌, పంజాబ్‌, హర్యానా, ఉత్తరాఖండ్‌తో పాటు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ కూడా నివాస గృహాలు మంజూరు చేయలేకపోయాయని కేంద్రం తెలిపింది.
కేంద్రం నిర్మించాలని భావిస్తున్న 2.95 కోట్ల నివాస గృహాలలో 2.04 కోట్ల గృహాలను సామాజిక ఆర్థిక కుల గణాంకాల (ఎస్‌ఈసీసీ) ప్రాతిపదికన రాష్ట్రాలకు కేటాయించారు. మిగిలిన 91 లక్షల గృహాలను దేశవ్యాప్తంగా 2018 జూన్‌-2019 మార్చి మధ్య జరిపిన ఆవాస్‌ సర్వే ఆధారంగా కేటాయించారు. అయితే కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రం కేంద్రం విధించిన గడువు జూన్‌ 30 లోగా 1,44,220 గృహాలను మంజూరు చేయలేకపోయాయి. వీటిలో ఎస్‌ఈసీసీ గణాంకాల ఆధారంగా కేటాయించినవి 7,496 కాగా మిగిలిన 1,36,724 గృహాలు ఆవాస్‌ జాబితా లోనివి. ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌కు 34.72 లక్షల గృహాలు కేటాయించారు. అయితే తమకు అదనపు కేటాయింపులు జరపాలని ఆ రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా అయిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు లేఖ రాశారు.
గడువు ముగిసిందని…
గ్రామీణ ప్రాంతాలలో కనీసం ఇరవై ఐదు చదరపు మీటర్ల విస్తీర్ణంలో పక్కా ఇళ్లు నిర్మించాలని ఈ పథకంలో నిర్దేశించుకున్నారు. ప్రతి లబ్దిదారుకు మైదాన ప్రాంతమైతే రూ.1.2 లక్షల వరకూ, కొండ ప్రాంతమైతే రూ.75 వేల నుండి రూ.1.30 లక్షల వరకూ అందజేస్తారు. పథకానికి అవసరమయ్యే నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. అర్హులైన లబ్దిదారులకు నివాస గృహాలు మంజూరు చేసేందుకు కేంద్రం జూన్‌ 30వ తేదీ వరకూ గడువు ఇచ్చింది. గడువు ముగిసిన ప్పటికీ 1,44,220 గృహాలను మంజూరు చేయలేక పోయారనే సాకుతో ఇప్పుడు ఆ కేటాయింపులను కేంద్రం ఉపసంహరించుకుంది.

Spread the love