జర్నలిస్టులకు ఇండ్లు మంజూరు చేయండి

– హోంమంత్రి మహమూద్‌ అలీకి హెచ్‌యూజే ప్రతినిధి బృందం విజ్ఞప్తి
నవతెలంగాణ-సిటీబ్యూరో
అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌(హెచ్‌యూజే-టీడబ్ల్యూజేఎఫ్‌) ప్రతినిధి బృందం హోంమంత్రి మహమూద్‌ అలీని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు హెచ్‌యూజే ప్రతినిధి బృందం సోమవారం హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్‌లో హోంమంత్రిని కలిసి వినతిపత్రం అందజేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు ప్రభుత్వం స్థానికంగా ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తోందని, హైదరాబాద్‌ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకూ ఇండ్ల స్థలాలు లేదా ఇండ్లు మంజూరు చేయాలని ప్రతినిధులు కోరారు. జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రికి గుర్తు చేశారు. దీనిపై హోంమంత్రి స్పందిస్తూ.. అన్ని వర్గాల ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల కేటాయింపు తమ దృష్టిలో ఉన్నదన్నారు. హైదరాబాద్‌లో జర్నలిస్టు కాలనీ నిర్మించాలని సీఎం కేసీఆర్‌ ఆలోచనలో ఉన్నదని చెప్పారు. జర్నలిస్టుల ఇండ్ల కేటాయింపు అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరగా నిర్ణయం తీసుకునేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. హోంమంత్రిని కలిసిన వారిలో హెచ్‌యూజే అధ్యక్షులు బి.అరుణ్‌ కుమార్‌, కార్యదర్శి బి.జగదీశ్వర్‌, కోశాధికారి బి.రాజశేఖర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గండ్ర నవీన్‌, హెచ్‌యూజే ఆఫీస్‌ బేరర్లు క్రాంతి, లక్ష్మణ్‌ రావు, ఎస్‌.రమేష్‌, టీడబ్ల్యూజేఎఫ్‌ కార్యదర్శి కొప్పు నిరంజన్‌, సీనియర్‌ జర్నలిస్టు శ్రీకాంత్‌ ఉన్నారు.

Spread the love