అరుణాచల్​, చైనా బార్డర్​ లో విరిగిపడ్డ కొండ చరియలు..

నవతెలంగాణ – ఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ లోని చైనా సరిహద్దుకు సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీనితో ఆ ప్రాంతంలో 33వ నంబర్ జాతీయ రహదారి కూడా తెగిపోయింది. చైనాకు సరిహద్దుగా ఉన్న దిబంగ్ వ్యాలీకి రాకపోకలు సాగించేందుకు ఈ హైవే ఒక్కటే మార్గం కావడం గమనార్హం. ఇది దెబ్బతినడంతో వ్యాలీకి.. ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయినట్టు అయింది. అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీనితో కొండలు, లోయల మీదుగా నీటి ప్రవాహాలు పెరిగాయి. దీంతో దిబంగ్ వ్యాలీకి వెళ్లే హైవేపై హున్లి, అనిని పట్టణాల మధ్య కొండ చరియలు విరిగిపడ్డాయి. రోడ్డు పూర్తిగా తెగిపోవడం, మరో మార్గం లేకపోవడంతో.. పునరుద్ధరించడానికి కనీసం మూడు రోజులకుపైగా పడుతుందని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ ప్రకటించారు. పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. దిబంగ్ వ్యాలీ చైనాకు సరిహద్దు ప్రాంతం కావడంతో.. ముందు జాగ్రత్తగా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు జరుగుతున్నాయని స్థానిక అధికారులు తెలిపారు.

Spread the love