అయ్యా..!

అయ్యా..!చెట్టుపైన కాకి కూసింది
పలుగాకులన్నీ వచ్చి చేరాయి
మేత కోసం కాదని తెలిసాక
రెక్కలకు పని చెప్పాయి
అయ్యా ఇంతేనా నేటి స్థితి..!!

జెండాలన్నీ కొలువైనాయి
అజెండాలన్నీ మొహం తిప్పాయి
మెలితిరిగిన నోటికి ఎన్ని తిప్పలో
కలిసుందామనుకున్నవన్నీ
కలిసి చేద్దామని నిర్ణయించాక
చెదిరిపోయిన సంఘటనలెన్నెన్నో
అయ్యా ఇదేనా నేటి కూటమంటే..!!

విలువైన కాగితాలన్నీ
అర్ధరాత్రి నిద్ర లేచాయి
దొడ్డి దారుల్లో పరుగులు పెట్టాయి
జేబులన్నీ తెరుచుకున్నాక
మరో కలుగులోకి దూరిపోయాయి
అయ్యా ఇంతేనా పంచుకోవడమంటే!

అడిగినవన్నీ మరిపించి
చేతికొచ్చింది జారవిడిచి
దులిపేసుకున్న తీరులన్నీ నవ్వుకున్నాయి
ఎటూ కాని తికమకలో
మరో దారి చూసుకున్నాయి
అయ్యా ఇదేనా నమ్మకమంటే..!!

గాలి కబుర్లకు స్వరం కలిపి
నేటి గతులకు చరమగీతం పాడి
ఎగిరిన గుడ్డముక్కలన్నీ
కండ్లపై పడి లోకాన్ని మరిపించాయి
అయ్యా ఇదేనా రాజకీయమంటే..!!
– నరెద్దుల రాజారెడ్డి
9666016636

Spread the love