ముసొలిని మరణం నియంతలకు నీతిసూత్రం

ముసొలిని మరణం నియంతలకు నీతిసూత్రంకొందరి చావుకు మనుషులను కదిలించే, దుర్మార్గాలను ఆపే, క్రూరత్వం, మానవత్వం వైపు ఆలోచింపజేసే శక్తి ఉంటుంది. కొన్నిసార్లు అది సంతృప్తినిస్తుంది. సంతోషపెడుతుంది. ఏప్రిల్‌ 28, 1945న ఇటలీ నియంత బెనిటొ ముసొలిని చావు అలాంటిదే.రోమ్‌ ప్రాచీన గౌరవాన్ని పునరుద్ధరిస్తానని ప్రగల్బించిన ముసొలిని, ఆయన భార్య క్లారా పెటాచిల శవాలు మిలాన్‌ నగర ప్రధాన కూడలి పియాజలె లోరెటొలో గ్యాస్‌స్టేషన్‌ ముందర తలకిందులుగా వేలాడాయి.
ముసొలిని ప్రపంచ రాజనీతిజ్ఞుల్లో ఒకడు. 1922లో ఇటలీ అధికారాన్ని చేపట్టిన బలశాలి. ప్రథమ ప్రపంచ యుద్ధం తర్వాత శాంతిని పునరుద్ధరించాడు. ఫాసిస్టు పార్టీని, ప్రత్యర్థుల హత్యకు నల్లచొక్కాల సైన్యాన్ని స్థాపించాడు. ఇటలీని సైనికశక్తిగా దిద్దాడు. తనను డ్యూస్‌ (నాయకుడు) అని పిలుచుకున్నాడు. ప్రభుత్వం గ్రాండ్‌ కౌన్సిల్‌ అధీనంలో ఉంది. ఇటలీ ముసొలిని అధికార క్రీడాస్థలం. అది ఫాసిజం కాదు. ముసొలినిజం. మోడీయిజం లాగా. 1930లలో ముసొలిని గొప్ప ప్రజావిగ్రహం. లక్షలాది అనుచరులు డ్యూస్‌ అని నినదిస్తుండగా, భట్రాజులు భజిస్తుండగా, కోఠరీ పూజిస్తుండగా సెయింట్‌ మార్క్‌ భవనం పలాజొ వెనెజియ వరండాలో విలాసంగా కూర్చునేవాడు. (పార్లమెంటులోనే మోడీ అని పొగిడినట్లు. మోడీ తప్ప మరెవరు చేయగలరని మోడీ విర్రవీగినట్లు) ఆదేశాలిస్తున్న, గుర్రపుస్వారి చేస్తున్న, విమానంలో ఎగురుతున్న, పందెపు కారు నడుపుతున్న భంగిమల్లో ఫొటోలు దిగేవాడు. (మోడీ సెల్ఫీల లాగా)మండుటెండలో నడుంగుడ్డతో రైతులతో మాట్లాడేవాడు. సింహం పిల్లతో కుస్తీపట్టేవాడు. ప్రచారానికి ఈ ఫొటోలను దేశమంతా ప్రదర్శించేవారు. (కోవిడ్‌ టీకాలు, ప్రభుత్వ పత్రాల్లో మోడీ బొమ్మను ముద్రించినట్లు) ఇటలీ కవి డాంటె పద్యాలను పాడేవాడు.(శ్రీశ్రీ, గురజాడల గేయాలను మోడీ ఉచ్ఛరించినట్లు) ప్రజల కోసం రాత్రంతా పనిచేస్తున్నాడని నమ్మించేందుకు, ముసొలిని నిద్రపోయినా, రాత్రంతా గదిలో దీపాలుండేవి. డ్యూస్‌ ఎప్పుడూ న్యాయబద్దుడేనన్న నినాదం ప్రజలకందేది. (ప్రజాశ్రేయస్సు, దేశాభివృద్ధే లక్ష్యంగా మోడీ 18 గంటలు పనిచేస్తాడని సంఘీయులు బాకాలూదినట్లు)
ప్రభుత్వానికి, చర్చికి మధ్య వివాదాన్ని ముగిస్తూ చర్చితో 1929లో ఒప్పందం చేసుకున్నాడు. రోమన్‌ క్యాథలిక్‌ సమాజంలో ఇది ముసొలినికి 98శాతం ఓట్లను తెచ్చిపెట్టింది. (మోడీ హిందుత్వ సమీకరణ లాగా) ప్రజాప్రయోజన పనులు, రోమ్‌ పరివాహక చిత్తడినేలల నుండి నీటిని తోడే ప్రయత్నాలు జరిగాయి. ఆర్థిక వ్యవస్థను కార్పోరేటికరించాడు. దేశాన్ని 22 కార్పొరేట్లుగా మార్చి పరిశ్రమల, ముడిలోహాల అభివృద్ధి, సరుకు ఉత్పత్తి, పంపిణీలను వాటికి అప్పజెప్పాడు. కార్మికులు, యాజమాన్యాల మధ్య సంధి ఏర్పాటు ఈ కార్పొరేట్ల పని. సంధి కుదరకపోతే కార్మికులు ప్రభుత్వ మధ్యవర్తిత్వానికి కట్టుబడి ఉండాలి. పరిశ్రమల్లో నిరసనలను, సమ్మెలను నిషేధించారు.ఆచరణలో అసాధ్య, అవాస్తవ పౌరాణిక పంథా ప్రచారం జరిగింది.సమ్మెలు, సంఘాల నిషేధం కార్మికులపై సమ్మెటపోటుగా మారింది. యాజమాన్యం లాభపడింది. ముసొలిని పాలనలో వస్తూత్పత్తి, సేవల పంపిణీ, జాతి ఆర్థిక జీవన నిర్ణయాలు ప్రభుత్వం నుండి పారిశ్రామికవేత్తలకు మారాయి.ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారు. ఇటలీ ఫాసిస్టు సమాజంగా మారింది. పౌరజీవితాలు రాజ్యం అధీనంలోకి వచ్చాయి. (కార్మిక చట్టాలతో కార్పొరేట్ల సేవలో మోడీ తరించినట్లు)
విరామ సమయంలో ప్రజలు ఫాసిస్టు సంస్థ డోపొలవోరొ ఆదేశంలో క్లబ్బుల్లో, పబ్బుల్లో, బార్లలో, క్రీడాస్థలాల్లో, గ్రంథాలయాల్లో, సెలవు కేంద్రాల్లో పనిచేయాలి. పిల్లలు ‘యువ ఫాసిస్టు’ సంస్థల్లో చేరాలి. నియంతృత్వం ప్రజల నిష్క్రియా విధేయతను కోరుకుంటుంది. ముసొలిని ఫాసిజం ప్రజల స్థిరప్రమేయాన్ని, అత్యుత్సాహ భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేసింది. ప్రభుత్వ రహస్య పోలీసు వోవ్ర ప్రజల ప్రవర్తనను తెరవెనుక నుండి గమనిస్తూ ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థులను, పాలనా విధానాలను ప్రశ్నించేవారిని అరెస్టుచేసి, కొట్టి చంపుతుంది. ఒకనాటి స్వేచ్ఛాపౌరులు రాజ్యాన్ని తప్పక సమర్థించాల్సిన స్థితికి నెట్టబడ్డారు. ”విశ్వసించు, విధేయతను పాటించు, రాజ్య సంక్షేమానికి పోరాడు.” అన్న నినాదాలే శరణ్యం. (మోడీ ఎన్‌ఐఎ., సిబిఐ, ఇడి, ఐటి శాఖల దాడుల్లాగా) ముసొలిని విదేశీ విధానం దుర్భర పరిస్థితులను తెచ్చిపెట్టింది. ఇటలీ సైనిక గౌరవాన్ని గెలవడం, ప్రాచీన ఘనతను పునరుద్ధరించడం లక్ష్యాల్లో కొన్ని. రోమన్‌ సామ్రాజ్య పున:సృష్టిని గురించి ముసొలిని నిరంతరం మాట్లాడేవాడు. మధ్యధరా సముద్రం మనదే అనేవాడు. సామ్రాజ్యవాద విధి, ఇటలీ వందన విధానాల గురించి ప్రజలకు గుర్తుచేసేవాడు. ఇటాలియన్లు నివసించే విదేశ భూభాగాలన్నీ ఇటలీ భాగాలే, ఇవి విమోచన పొందని ఇటలీ అని ప్రచారం చేసేవాడు. (సంఫ్‌ు వైదిక సంస్కృతి, అఖండ భారత్‌ నినాదాల్లాగా)
ఆఫ్రికాలో, ప్రత్యేకించి తూర్పు ఆఫ్రికా రాజ్యం ఇథోపియాలో, వలస రాజ్య స్థాపన ముసొలిని లక్ష్యం. నిత్యం దాడి గురించి మాట్లాడడమే గాక త్రివిధ దళాల సైన్యాలను పెంచాడు. మౌలిక సౌకర్యాలు లేని ఇటలీకి ఇది ఖరీదైన అంశం. ఫ్రాన్స్‌, బ్రిటన్‌లతో సహా ఇటలీ పొరుగు దేశాలు ముసొలిని సైనిక విస్తరణ, యుద్ధకాంక్షలను తీవ్రంగా పరిగణించాయి. ఇటలీ దాడికి భయపడ్డాయి. ఈ తడబాటు హిట్లర్‌ జర్మనీ పట్ల ఫ్రాన్స్‌, బ్రిటన్‌ల కఠిన వైఖరికి కారణమైంది. హిట్లర్‌ కౌగిలి ముసొలినికి ప్రాణాంతకమైంది. 1940 జూన్‌లో జర్మన్‌ సైన్యాలు ఐరోపా దాడులకు దిగాయి. ముసొలిని ఫ్రాన్స్‌, బ్రిటన్‌ లపై యుద్ధం ప్రకటించాడు. సైన్యంపై ఖర్చులు ఫలితాలనిస్తాయని, తాను కొత్త ఇటలీని నిర్మిస్తానని, విశ్వ యోధుడనవుతానని నమ్మాడు. (కొత్త భారత్‌, విశ్వగురు ప్రచారాల్లాగా).కాని అలా జరగలేదు. హిట్లర్‌తో కలయిక ఇటలీని విపత్తులకు గురిచేసింది. 1940 సెప్టెంబర్‌లో ఇటలీ లిబియా నుంచి 1,30,000 మంది సైనికులతో ఈజిప్టుపై దాడిచేసింది. 50 మైళ్ళు పయనించిన తర్వాత మార్షల్‌ రొడోల్ఫొ గ్రజియాని నెల్ల తరబడి కొత్త దారులు నిర్మించుకొని లిబియాకు తిరిగివచ్చాడు. అక్టోబర్‌లో అల్బేనియా నుంచి ఇటలీ సౖౖెన్యం గ్రీస్‌పై దాడిచేసింది. గ్రీకు సైన్యం ఇటలీ సైన్యాన్ని తిప్పికొట్టింది. గ్రీస్‌కు సహాయంగా బ్రిటన్‌ సైన్యాన్ని పంపింది. నవంబర్‌లో ఇటలీ నౌకాదళాన్ని ధ్వంసం చేసింది.
1940 డిసెంబర్‌ నుంచి 1941 ఫిబ్రవరి వరకు బ్రిటిష్‌ సైన్యం ఈజిప్టులోని ఇటలీ సైన్యాన్ని నాశనం చేసింది. అమెరికా మిత్రపక్షాలు 1942 చివర ఇటలీ నగరాలను, 1943 జులైలో సిసిలీని, సెప్టెంబర్‌లో మొత్తం ఇటలీని ఆక్రమించుకున్నాయి. ముసొలిని అధికారం కోల్పోయి జైలుపాలయ్యాడు. తర్వాత 20 నెలలు జర్మనీ మిత్రపక్షాలతో యుద్ధం చేసినా ఇటలీ నగరాలు దెబ్బతిన్నాయి, ప్రజలు మరణించారు. 1943 సెప్టెంబర్‌లో జర్మన్‌ కమాండోలు జైలుపై దాడిచేసి ముసొలినిని విడిపించారు. ముసొలిని జర్మన్‌ చేతిలో కీలుబొమ్మ. అతని జీవితం హిట్లర్‌పై ఆధారపడింది. ముసొలినికి కొత్తగా స్థాపించిన జర్మనీ అనుబంధ ఇటలీ రిపబ్లిక్‌ సాలొ బాధ్యతలు అప్పజెప్పారు.
మిత్రపక్షాలు సాలొను ఆక్రమించాయి. ముసొలిని మిలాన్‌కు పారిపోయాడు. 1945 ఏప్రిల్‌లో ముసొలిని, పెళ్లాడని పెటాచి, కొందరు సైనికులు, జర్మన్‌ కాపాలాదారులు మిలాన్‌ నుంచి స్విస్‌ సరిహద్దు ప్రాంతం కోమో సరస్సు వైపు వెళ్లారు. రెండు రోజుల తర్వాత శత్రువులు ముసొలినిని గుర్తించారు. మరుసటి రోజు ముసొలినిజంను కోమో సరస్సు ఒడ్డున చిన్న పట్టణం గిలినొ డిమెజెగ్రకు తెచ్చి కాల్చిచంపారు. చనిపోయిన నా ఐదుగురు కుమారుల ప్రతీకారం అంటూ ఒక స్త్రీ ముసొలిని మృతదేహంపై ఐదు గుండ్లు పేల్చింది.ఏ భావజాలం పనిచేయలేదు. డ్యూస్‌ అని పొగిడిన ప్రజలే ముసొలినిని ఛీదరించుకున్నారు.శవాన్ని తిట్టారు, తన్నారు, ఉమ్మేశారు.బహుశా ఇందులో ముసొలినికి సాటిగా హిట్లర్‌ నిలుస్తాడు. నేడు ప్రపంచంలో పెరిగిన నియంతలు ముసొలిని మరణం నుంచి గుణపాఠం నేర్చుకోవాలి.
సంగిరెడ్డి హనుమంత రెడ్డి 9490204545

Spread the love