చిన్న దేశం-పెద్ద సందేశం

చిన్న దేశం-పెద్ద సందేశంఆదివారం ఏప్రిల్‌ 19, 2024న జరిగిన మాల్దీవుల పార్లమెంటు ఎన్నికల్లో విజేత చైనా అంటూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక శీర్షిక పెట్టింది. దాదాపు అన్ని పత్రికలూ చైనా అనుకూల పార్టీ సూపర్‌ మెజారిటీ సాధించినట్లు నివేదించాయి. పీపుల్స్‌ మజ్లిస్‌ (పార్లమెంటు)లోని 93 స్థానాలకు గాను (ఇది రాస్తున్న సమయానికి అధికారికంగా లెక్కింపు పూర్తికాలేదు) పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(పిఎన్‌సి), దాన్ని బలపరుస్తున్న వారికి 75, భారత అనుకూల మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీకి 15 స్థానాలు వచ్చినట్లు వార్తా సంస్థలు తెలిపాయి. మొత్తం 368 మంది పోటీ చేశారు. వారిలో 130 మంది స్వతంత్రులు కాగా మిగిలిన వారు ఏడు రాజకీయ పార్టీలకు చెందిన వారు. ఈ ఎన్నికల పర్యవసానాల గురించి సహజంగానే విశ్లేషణలు మొదలయ్యాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో మాల్దీవుల డెమోక్రటిక్‌ పార్టీ 45.83 శాతం ఓట్లతో 87 స్థానాలకు గాను 65 తెచ్చుకుంది. ఆ ఎన్నికల నాటికి నూతన పార్టీగా పిఎన్‌సి 6.63శాతం ఓట్లు, మూడు సీట్లు తెచ్చుకుంది. గతేడాది సెప్టెంబరు 9న జరిగిన ఎన్నికల్లో ఎవరికీ అవసరమైన 50శాతం పైగా మెజారిటీ రాకపోవటంతో 30న జరిగిన తుది దఫా ఎన్నికల్లో ఈ పార్టీ నేత మహమ్మద్‌ ముయిజ్జు 54.04శాతం ఓట్లతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు, నవంబరు 17న బాధ్యతలను స్వీకరించాడు.
అధ్యక్ష ఎన్నికలు, తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. చిన్నదైనా పెద్దదైనా ఏ దేశంలోనూ విదేశాలతో సంబంధాల ప్రాతిపదికన ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవు. చైనా – భారత్‌ మధ్య పోటీగా ఇక్కడ జరిగాయి. అందుకే అసలు విజేత చైనా అన్నట్లుగా వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ” అధ్యక్ష ఎన్నికలు తమ పౌరుల దేశభక్తికి ఒక ప్రతిబింబమని, మా ఇరుగు పొరుగు వారు, భాగస్వాములు తమ స్వాతంత్య్రం, సర్వసత్తాకతను పూర్తిగా గౌరవించాలని ఇచ్చిన ఒక పిలుపు ” అని పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి వ్యాఖ్యానించాడు.పార్లమెంటు ఎన్నికలు మరింత తీవ్రంగా జరిగాయి. చైనా బిఆర్‌ఐ పధకం కింద పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన గత ప్రభుత్వంలో గృహశాఖ మంత్రిగా ముయిజ్జు పనిచేశాడు. తాను అధికారానికి వస్తే రెండు దేశాల మధ్య మరో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతానని ఎంతో ముందుగానే ప్రకటించాడు.చెప్పినట్లుగానే భిన్నమైన రీతిలో వ్యవహరిస్తున్నాడు.గతంలో మాల్దీవుల్లో ఎవరు అధికారానికి వచ్చినా తొలి విదేశీ పర్యటన భారత్‌తోనే ప్రారంభమయ్యేది. అలాంటిది ముయిజ్జు తొలుత టర్కీ, తరువాత యుఏయి, చైనా పర్యటించాడు.2019లో మనదేశంతో కుదుర్చుకున్న జలవాతావరణ(హైడ్రాలజీ) పరిశీలన పధకం నుంచి మాల్దీవులు వైదొలిగింది. అక్కడ ఉన్న కొద్ది మంది మన సైనికులను కూడా దశలవారీ మే 10వ తేదీలో వెనక్కు వెళ్లాలని కోరింది. రద్దీగా ఉండే తూర్పు-పశ్చిమ దేశాల నౌకా రవాణా మార్గంలో మాల్దీవులు కీలకమైన ప్రాంతంలో ఉంది. అమెరికా విశాల మిలిటరీ వ్యూహంలో హిందూ మహాసముద్రం ఎంతో ముఖ్యమైనది. బ్రిటీష్‌ ఆక్రమించిన మారిషస్‌కు చెందిన డిగోగార్సియా దీవులను అమెరికా తన ఆధీనంలోకి తెచ్చుకొని ఖాళీ చేసేందుకు మొరాయిస్తున్నది. అక్కడ ఒక సైనిక స్థావరాన్ని కూడా నిర్మించింది. మనదేశంలోని కన్యాకుమారికి ఆ దీవులు 1,796కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. అది మనదేశంతో పాటు పరిసరాల్లోని అన్ని దేశాలకూ ఆందోళన కలిగించే అంశమే. బంగాళాఖాతం,హిందూ మహాసముద్రం, అరేబియా సముద్ర ప్రాంతంలోని కొన్ని దేశాలు అమెరికా పట్టునుంచి విడివడటం, అవి క్రమంగా చైనాకు సన్నిహితం కావటం పశ్చిమ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. తమ విదేశాంగ విధానంలో కొన్ని మార్పులు చేశాం తప్ప ఎవరివైపూ మొగ్గటం లేదని ముయిజ్జు ప్రకటించాడు.
మాల్దీవుల ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత కారణంగా 1965లో బ్రిటన్‌ ఆక్రమణ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత మన దేశం అన్ని రంగాలలో దగ్గరయ్యేందుకు చూసింది. 1988లో దాదాపు రెండు వందల మంది తమిళ ఉగ్రవాదులు మాల్దీవులకు వెళ్లి నాటి అధ్యక్షుడు అబ్దుల్‌ గయూమ్‌ మీద తిరుగుబాటు చేసి కీలకమైన ప్రాంతాలన్నింటినీ పట్టుకున్నారు. తమను అదుకోవాలని అనేక దేశాలను గయూమ్‌ కోరినా ఎవరూ ముందుకు రాలేదు. భారత్‌ స్పందించింది, ఆపరేషన్‌ కాక్టస్‌ పేరుతో కుట్రను విఫలం చేసి అనేక మంది కుట్రదారులను కాల్చి చంపి, కొందరిని బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి సంబంధాలు మరింతగా బలపడ్డాయి. తరువాత జరిగిన పరిణామాల్లో దీవుల ఆర్థిక సమస్యలను, పౌరుల జీవితాలను మెరుగుపరచటంలో పాలకుల వైఫల్యం కారణంగా జనంలో అసంతృప్తి తలెత్తింది. సరిగ్గా అదే సమయంలో చైనా తన బిఆర్‌ఐ పధకాన్ని ముందుకు తెచ్చింది. ఐఎంఎఫ్‌, ప్రపంచబాంక్‌, అమెరికా, ఇతర పశ్చిమదేశాల మాదిరి కఠినమైనవి కాకుండా సాధారణ షరతులతో ప్రాజెక్టులకు చైనా రుణాలు ఇచ్చింది. దాంతో 2013లో అధికారానికి వచ్చిన అబ్దుల్లా యామిన్‌ చైనాతో సంబంధాలను పెంచుకున్నాడు. 2018లో గెలిచిన ఇబ్రహీం సాలి భారత్‌కు పెద్దపీట అనే విధానంతో మన దేశానికి సన్నిహితంగా భాగస్వామ్య ఒప్పందాలను చేసుకున్నాడు. అది ఎన్నికల్లో పెద్ద చర్చ నీయాంశంగా మారింది. ప్రతిపక్షాలుగా ఉన్న మాల్దీవుల ప్రోగ్రెసివ్‌ పార్టీ, పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఒక కూటమిగా ఏర్పడి ” భారత్‌ను బయటకు పంపాలి(భారత్‌ అవుట్‌) ” అనే నినాదమిచ్చాయి. మనదేశం అనుసరించిన కొన్ని విధా నాలు, అంతర్గత వ్యవహారాల్లో జోక్యంతో జనంలో ఉన్న భారత వ్యతిరేక మనోభావాలు కూడా దీనికి దోహదం చేశాయి. మనదేశానికి చెందిన జిఎంఆర్‌ కంపెనీ మాలెలోని విమానాశ్రయ అభివృద్ధి నిర్వహణ బాధ్యతలు తీసుకుంది.విదేశీ ప్రయాణీకులతో పాటు మాల్దీవుల పౌరుల మీద అభివృద్ధి పన్ను విధించటంతో అక్కడ వ్యతిరేకత వెల్లడైంది. దాని వెనుక మాజీ అధ్యక్షుడు నషీద్‌ మద్దతు ఉందని జనం భావించారు. అవినీతి ఆరోపణల కేసులో అరెస్టు కాకుండా తప్పించు కొనేందుకు అతగాడు భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందాడు. అది కూడా జనంలో మనదేశం మీద వ్యతిరేకత పెరిగేందుకు దోహదం చేసింది.
మాల్దీవుల విదేశాంగ విధానంలో వచ్చిన మార్పులో చైనా వైపు మొగ్గుదల మననేతలకు సహజంగానే రుచించలేదు. ఒక స్వతంత్ర దేశం, అందునా కీలక ప్రాంతంలో ఉన్నందున దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పునరుద్దరించుకొనేందుకు, కనీసం మరింత దిగజారకుండా చూసుకొనేందుకు ప్రయత్నించటం రాజనీతిజ్ఞుల లక్షణం. ఏ కారణంగానైనా దూరంగా జరిగినా, వైరం పెరిగినా ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయటం ఒక ప్రధాన ధోరణిగా కనిపిస్తున్నది.వాణిజ్య యుద్ధాలు, దిగుమతులు, ఎగుమతులు, సాంకేతిక పరిజ్ఞానం అందచేత, పెట్టుబడులపై నిషేధాలు వాటిలో భాగమే. ఒక దేశం, దేశనేతలను కించపరిస్తే ఎవరూ సహించాల్సిన అవసరం లేదు. అధికారికంగా నిరసన తెలపటం అనేక ఉదంతాల్లో జరిగింది. సామాజిక మాధ్యమాల్లో మన ప్రధాని నరేంద్రమోడీని అవమానించినందుకుగాను మాల్దీవులకు తగిన బుద్ది చెప్పాలని, అందుకు మన విహార యాత్రీకులు అక్కడికి వెళ్లటం మానుకోవాలని మన దేశంలోని వారు సామాజిక మాధ్యమంలో పిలుపులిచ్చారు. ఒక విమానయాన సంస్థ నిరవధికంగా ప్రయాణాలను నిలిపివేసినట్లు ప్రకటించింది. మోడీ, భారత్‌ను సామాజిక మాధ్యమంలో కించపరుస్తూ వ్యాఖ్యానించినందుకు మల్షా షరీఫ్‌, మరియం షిహునా, అబ్దుల్లా మఝూన్‌ మజీద్‌ అనే ముగ్గురు ఉప మంత్రులను అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు సస్పెండ్‌ చేశారు. మోడీని వారు హాస్యగాడు, ఉగ్రవాది, ఇజ్రాయిల్‌ తొత్తు అని, మన దేశంలో పరిశుభ్రత తక్కువ అని పేర్కొన్నారు. అరేబియా సముద్రంలోని మన లక్షద్వీప్‌లో విహార యాత్రలను ప్రోత్సహించేందుకు గాను మోడీ ఒక బీచ్‌లో కూర్చున్న వీడియోను పోస్టు చేసిన తరువాత ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. తమ దేశానికి యాత్రీకులు రాకుండా చేసేందుకే ఇలా చేశారని అక్కడి కొందరు భావించారు. ప్రధానిని కించపరచటం గురించి మాలే లోని మన రాయబారి అక్కడి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. మాల్దీవుల ప్రతిపక్ష నేతలు అధ్యక్షుడి మీద అవిశ్వాస తీర్మానం పెడతామనే వరకు వెళ్లారు. సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలను తాము గమనించామని, అవి వారి వ్యక్తిగతం తప్ప అధికారిక వైఖరి కాదని అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసింది. జరిగినదాని మీద అధ్యక్షుడు ముయిజ్జు విచారణకు ఆదేశించారని రాయిటర్స్‌ పేర్కొన్నది. కారణాలు ఏమైనప్పటికీ మనదేశం నుంచి మాల్దీవులకు వెళుతున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అక్కడి ప్రభుత్వం తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం గతేడాది జనవరి-మార్చి మాసాల మధ్య మన దేశం నుంచి 56,208 మంది మాల్దీవులకు వెళితే ఈ ఏడాది 34,847కు (38శాతం) తగ్గింది. అదే చైనా నుంచి వచ్చిన వారు 17,691 నుంచి 67,399 (281శాతం) పెరిగారు. అక్కడకు విదేశాల నుంచి వచ్చేవారిలో చైనా వాటా పది నుంచి అగ్రస్థానానికి చేరగా, మనదేశం మూడు నుంచి ఆరవ స్థానానికి తగ్గింది.
అధ్యక్షుడు ముయిజ్జు అనుసరిస్తున్న విధానాలతో విబేధించిన ప్రతిపక్షం పార్లమెంటులో తనకు ఉన్న మెజారిటీని ఆధారం చేసుకొని అభిశంసన తీర్మానం ద్వారా తొలగించేందుకు కూడా చూసింది. తాజా ఎన్నికల్లో అధికార పక్షం నాలుగింట మూడువంతులకు పైగా స్థానాలు సాధించటంతో అలాంటి ముప్పు తొలగటమే గాక అధ్యక్షుడికి మరింత పట్టుదొరికింది. జనవరిలో చైనా పర్యటన జరిపిన ముయిజ్జు అనేక ఒప్పందాలు చేసుకున్నాడు. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలను జనం బలపరిచినట్లు ఫలితాలు స్పష్టం చేశాయి. ఇంతవరకు మనదేశ పర్యటనకు రాలేదు. మాల్దీవులకు భారత్‌ స్నేహ హస్తం చాచేందుకు విముఖత చూపితే చైనాపై మరింతగా ఆధారపడతారని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మాల్దీవులకు పర్యాటకులు వెళ్లవద్దని అధికారికంగా మన ప్రభుత్వం చెప్పకపోయినా జరిగిన పరిణామాలను చూస్తే నష్టం జరిగిందన్నది స్పష్టం.
హనైమధూ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌తో సహా అనేక మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాలలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు మనదేశం పెట్టుబడులు ఉన్నాయి. వాటికి ఎలాంటి ముప్పు రాదు.మాల్దీవు ఎన్నికల్లో చైనా-భారత్‌లతో సంబంధాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతమాత్రాన వెల్లడైన తీర్పును ఆ ఒక్క అంశానికే ఆపాదించటం, మనదేశానికి వ్యతిరేకంగా పరిగణించాల్సిన అవసరం లేదు. అభివృద్ధి పథకాలకు పెట్టుబడులు కావాలని కోరినపుడు అనేక పశ్చిమ దేశాలు అక్కడ హక్కులకు భంగం కలిగించే పాలకులు ఉన్నారంటూ నిరాకరించాయి. ఆ సమయంలో చైనా ముందుకు వచ్చింది. హక్కులు, పాలన అనేది ఆయాదేశాల అంతర్గత వ్యవహారాలు, వాటికి పెట్టుబడులను ముడిపెడితే రాజకీయ పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉండేది చెప్పలేము.
ఎం కోటేశ్వరరావు
8331013288

Spread the love