ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి

– రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌
నవతెలంగాణ-ఉట్నూర్‌
గిరిజన ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్‌ ఆర్వీ. కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉట్నూర్‌లోని కెేబీ కాంప్లెక్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌, ఐటీడీఏ పీఓ చాహత్‌ బాజ్‌ పారులతో కలిసి ఆదిలాబాద్‌, కుమురం భీం అసిఫాబాద్‌ జిల్లా వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలన్నారు. ఆస్పత్రుల్లో అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమకం, అవసరమైన సామాగ్రిని సమకూర్చుకోవాలని సూచించారు. ప్రధాన మంత్రి జన్‌ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ (పీఎం- జన్మన్‌) కార్యక్రమంలో భాగంగా ప్రతి పీవీటీజీ కుటుంబాలకు ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్‌ భరత్‌ పథకాలను అమలు చేయాలనీ ఆదేశించారు. ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి వివిధ రకాల పరీక్షలు నిర్వహించాలన్నారు. కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ మాట్లాడుతూ రిమ్స్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆస్పత్రుల వారిగా ప్రసవాలు, అందిస్తున్న వైద్య చికిత్సలపై సమీక్షించారు. అనంతరం కేబీ కాంప్లెక్‌ ప్రాంగణంలో అధికారులతో కలిసి కలెక్టర్‌ మొక్కను నాటి నీరు పోశారు. అనంతరం ఉట్నూర్‌ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తుదారుల వివరాలను నమోదు చేయాలనీ అధికారులు, ఆపరేటర్‌లకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖుష్భు గుప్త, శిక్షణ సహాయ కలెక్టర్‌ వికాస్‌ మోహతో, ఆదిలాబాదు, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులు, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.
టీహబ్‌ పనులన పరిశీలన..
గిరిజనులకు మరింత మెరుగైన ప్రభుత్వ వైద్యం అందించలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పిస్తుందని హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫెర్‌ డైరెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. బుధవారం ఉట్నూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ముందుగా నిర్మాణంలో ఉన్న తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడుతూ పురోగతిని తెలుసుకున్నారు. అస్పత్రిలో రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యం గురించి తెలుసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా వైద్య శిబిరాలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ నరేందర్‌ను ఆదేశించారు. రెండు నెలల్లో తెలంగాణ గయాగ్నోస్టిక్‌ పనులు పూర్తై వినియోగంలోకి వస్తుందన్నారు. అదే విధంగా ఆశ వర్కర్లు గర్భిణులకు నెలనెల వైద్య చికిత్సలు అందించే విధంగా చూడాలన్నారు. వారి వివరాలను వారి వద్ద ఉండాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేల అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వైద్యులు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని ఆదేశించారు. ఉట్నూర్‌కు వచ్చిన ఆయనకు ఉద్యోగులు, సిబ్బంది పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మహేందర్‌, కపిల్‌, అనురాధ, సిబ్బంది ఉన్నారు.

Spread the love