డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట

నవతెలంగాణ – హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు భారీ ఊరట లభించింది. ఆయనపై 2018లో నమోదైన మనీ లాండరింగ్‌ కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. పన్ను ఎగవేత, హవాలా లావాదేవీల ఆరోపణలతో ఆయనపై మోపిన అభియోగాలు మనీలాండరింగ్‌ నిరోధక చట్టం నిబంధనలకు అనుగుణంగా లేవని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్‌ 2019లో డీకేను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ తోపాటు ఆయన సన్నిహితుల నివాసాలపై 2017లో ఆదాయపన్ను శాఖ దాడులు జరిపింది. దేశవ్యాప్తంగా చేసిన ఆ దాడుల్లో భారీ నగదును ఐటీ శాఖ గుర్తించింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆయనపై కేసు నమోదు చేసింది. ఈక్రమంలో ఈడీ ఇచ్చిన సమన్లు కొట్టివేయాలని కోరుతూ కర్ణాటక హైకోర్టును డీకే ఆశ్రయించారు. అక్కడ ఆయనకు ఊరట లభించకపోవడంతో 2019లో సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ కేసును విచారించిన జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం.. రికవరీ చేసిన నగదు మనీలాండరింగ్‌కు సంబంధించిందని నిరూపించడంలో దర్యాప్తు సంస్థ విఫలమైందని పేర్కొంటూ ఈ కేసును కొట్టివేసింది.

Spread the love