కొటాక్‌ మహీంద్రాకు భారీ షాక్‌

కొటాక్‌ మహీంద్రాకు భారీ షాక్‌– క్రెడిట్‌ కార్డుల జారీ నిలిపివేత
– ఆన్‌లైన్‌లో సేవింగ్‌ ఖాతాలపై ఆంక్షలు
– ఆర్‌బీఐ ఆదేశాలు
– ఐటీ నిర్వహణలో లోపాలపై చర్యలు
న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌కు రిజర్వ్‌ బ్యాంక్‌ భారీ షాక్‌ ఇచ్చింది. క్రెడిట్‌ కార్డుల జారీని తక్షణం నిలిపి వేయాలని బుధవారం ఆదేశించింది. అదే విధంగా ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాకింగ్‌ పద్దతుల్లో కొత్త ఖాతాదారులను చేర్చుకోవడానికి వీలు లేదని స్పష్టం చేసింది. కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఐటీ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌లో లోపాలను గుర్తించడంతో ఆర్‌బిఐ చర్యల తీసుకుంది. ఆర్థిక సంవత్సరం 2022-23లో ఐటి ఆడిట్‌లో గుర్తించిన లోపాల ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఆయా లోపాలు, సమస్యలను పరిష్కరించడంలో బ్యాంక్‌ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది.బ్యాంక్‌ ఐటీ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌, ప్యాచ్‌ అండ్‌ ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌, యూజర్‌ యాక్సెస్‌ మేనేజ్‌మెంట్‌, వెండర్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, డేటా సెక్యూరిటీ, డేటా లీక్‌లను ప్రివెన్షన్‌ ఎత్తుగడలు లోపభూయిష్టంగా ఉన్నాయని కేంద్ర బ్యాంక్‌ తెలిపింది. ముఖ్యంగా ఐటీ రిస్క్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ గవర్నెన్స్‌ విషయంలో రెండు సంవత్సరాలుగా మార్గదర్శకాలు పాటించ లేదని గుర్తించినట్టు పేర్కొంది. ఇకపై బ్యాంకు ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ఛానెల్స్‌ ద్వారా కొత్త ఖాతాదారులను చేర్చుకోవడంతో పాటు కొత్త క్రెడిట్‌ కార్డులను జారీ చేయడం నిలిపివేయాలని ఆదేశించినట్లు పేర్కొంది. కాగా.. ప్రస్తుతం ఉన్న క్రెడిట్‌ కార్డు వినియోగదారులతో పాటు ఇతర వినియోగదారులకు గతంలో మాదిరిగానే సేవలు అందించవచ్చని తెలిపింది. ఆర్‌బీఐ నుంచి ముందస్తు అనుమతితో కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌లో సమగ్ర ఆడిట్‌ నిర్వహించాల్సి ఉంటుంది. దాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ సమీక్షించి, ఆ బ్యాంకు చేపట్టిన చర్యలపై సంతృప్తి చెందితే ఆంక్షల ఎత్తివేతపై నిర్ణయం తీసుకుంటుంది. 2020లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌పైనా ఆర్‌బీఐ ఈతరహా ఆంక్షలనే విధించింది. క్రెడిట్‌ కార్డుల జారీని నిలిపివేసింది. 2021 ఆగస్టులో ఆంక్షలు ఎత్తి వేసింది.

Spread the love