బీజేపీ పచ్చి దోపిడీ దొంగల పార్టీ

BJP is a party of looters– బలహీన వర్గాలకు ఆ పార్టీ బద్ద శత్రువు
– మోడీ ప్రధానియా..? మత ప్రచారకుడా..?
– రాజ్యాంగ రక్షకులు ఐక్యం కావాలి
– మతోన్మాదుల చెర నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి
– బీజేపీకి ఓటేయమని మందకృష్ణ చెప్పడం పచ్చి మోసం
– అంబేద్కర్‌, పూలే జన జాతర సదస్సులో.. రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి చంద్రకుమార్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘అక్రమార్కుల నుంచి ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో వేల కోట్లు లంచాలు తీసుకున్న బీజేపీ పచ్చి దోపిడీ, దొంగల పార్టీ. యుద్ధంలో వాడే డ్రోన్స్‌ కొనుగోలులో కూడా మోడీ అక్రమాలకు పాల్పడ్డారు. బడుగు, బలహీన వర్గాలకు బీజేపీ బద్ద శుత్రువు. దేవుని పేరిట ఓట్లడగడం ద్రోహం, పచ్చి మోసం. రాజ్యాంగం ప్రకారం ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, ఉచితంగా విద్య, వైద్యాన్ని అందించడమనేది ప్రభుత్వాల కనీస కర్తవ్యం. ప్రజల యోగక్షేమాలు పట్టించుకోకుండా రాజ్యాంగాన్ని అమలు చేయకుండా దేవుడి పేరు చెప్పి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న మోడీ దేశానికి ప్రధానియా..? లేక హిందు మత ప్రచారకుడా..?” అని హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి చంద్రకుమార్‌ ప్రశ్నించారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్‌ భవన్‌లో కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో ‘అంబేద్కర్‌, పూలే జన జాతర’ పేరిట నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. మనుధర్మ శాస్త్రం, కర్మ సిద్దాంత పేరిట 80 శాతంగా ఉన్న ప్రజల్ని శూద్రులుగా ముద్ర వేసి కుల వ్యవస్థను సృష్టించారన్నారు. అలాంటి శూద్రులకు చదువు, స్వేచ్ఛ, సమానత్వం, మాట్లాడే, జీవించే స్వేచ్ఛ కల్పించిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని మోడీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలు చేస్తున్నాయన్నారు.
మళ్లీ మోడీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి దాని స్థానంలో ప్రాచీన కాలం నాటి మనుధర్మ శాస్త్రాన్ని తెచ్చి పెట్టే ప్రమాదముందని హెచ్చరించారు. లౌకిక విధానానికి తూట్లు పొడుస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలని చూస్తున్న మోడీపై ఎన్నికల సంఘం క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. మోడీ చర్యలు చూస్తుంటే ఆయన ప్రధాన మంత్రి భారతీయులకా..? లేక హిందువులకేనా..? అనే అనుమానం కలుగుతుందన్నారు. పదేండ్ల బీజేపీ పాలనలో 300 రెట్లు దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకిచ్చిన హామీలేవీ అమలు కాలేదన్నారు. రూ.72 లక్షల కోట్ల నల్లధనాన్ని తెచ్చి పంచుతానని చెప్పిన మోడీ పచ్చి మోసకారి అని అన్నారు. మనుస్మృతి శక్తులకు, రాజ్యాంగ శక్తులకు మధ్య జరుగుతున్న ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో మనుస్మృతి వారుసులుగా ఉన్న బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపు నిచ్చారు.
మతోన్మాదుల చెర నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి: స్కైలాబ్‌ బాబు
మతోన్మాదుల చెర నుంచి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు పిలుపు నిచ్చారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి చాతుర్వర్ణ వ్యవస్థను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి ఓట్లు వేయాలని మందకృష్ణ మాదిగ చెప్పడం పచ్చి మోసమన్నారు. వందల పురుగుల్ని తిన్న బల్లి రాముడి ఫొటో చాటున దాక్కున్న చందంగా రాజ్యాంగాన్ని రద్దు చేసి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను తెస్తామంటున్న మోడీ.. రాముని పేరు చెప్పి ఓట్లడుగుతున్నాడని విమర్శించారు. నల్ల చట్టాలు తెచ్చి రైతుల్ని, లేబర్‌ కోడ్‌లు తెచ్చి కార్మిక వర్గాన్ని, రాజ్యాంగాన్ని రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్ని, మత రాజ్యాన్ని తెచ్చి లౌకిక వాదాన్ని దెబ్బతీయాలని చూస్తున్న బీజేపీని ఎన్నికల్లో చిత్తుగా ఓడించడమే పరిష్కారమన్నారు. మనిషిని మనిషిగా చూడని దుర్మార్గమైన వ్యవస్థను రూపుమాపేందుకు మహానీయులు జ్యోతిరావు పూలే, అంబేద్కర్‌ పోరాడారని గుర్తుచేశారు. ఆ మహానీయులు సాధించిన హక్కుల్ని కాపాడుకోవాలంటే మనువాద శక్తులైన బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. పోరాటాల గడ్డ అయిన తెలంగాణలో మతోన్మాదుల ఆగడాల్ని సాగనివ్వొద్దని, బీజేపీని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమిని బలపర్చాలని కోరారు. సదస్సు ప్రారంభానికి ముందు మహానీయుల చితప్రటాలకు పూలమాల వేశారు. కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షులు అతిమేల మాణిక్యం అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కృష్ణమూర్తి, సీనియర్‌ దళిత నాయకులు అనంతయ్య, న్యాయవాది రామారావు, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి అశోక్‌, కేజీకేఎస్‌ జిల్లా కార్యదర్శి రమేష్‌ గౌడ్‌, పీఎన్‌ఎం జిల్లా కార్యదర్శి నాగభూషణం, అవాజ్‌ జిల్లా నాయకులు ఖయ్యూం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు, వ్యకాస జిల్లా కార్యదర్శి ఎం.నర్సింహులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజయ్య, న్యాయవాది సుభాష్‌రాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మహేష్‌, వివిధ ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love