కేజ్రీవాల్‌, కవితలకు కస్టడీ పొడిగింపు

Custody of Kejriwal and Kavita extension– 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ ఎక్సైజ్‌ స్కాంకు చెందిన మనీలాండరింగ్‌ కేసులో తీహార్‌ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని మే 7 వరకూ 14 రోజుల పాటు రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఆయనతో పాటు ఈ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె. కవిత, ఆమ్‌ ఆద్మీ పార్టీ తరపున గోవా ఎన్నికల్లో ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరించిన చంద్రప్రీత్‌ సింగ్‌ల జ్యుడీషియల్‌ కస్టడీని కూడా మే 7 వరకూ పొడిగించింది. మంగళవారంతో వీరి కస్టడీ ముగియడంతో వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సీబీఐ ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపర్చారు. మరో 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థలు కోరడంతో కోర్టు అనుమతించింది.
కేజ్రీవాల్‌లో స్వల్ప మోతాదులో ఇన్సులిన్‌
జైలులో కేజ్రీవాల్‌కు షుగర్‌ లెవెల్స్‌ పెరగడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు సోమవారం సాయంత్రం స్వల్ప మోతాదులో వైద్యులు ఇన్సులిన్‌ ఇచ్చారు. దీనిపై ఆమ్‌ ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. హనుమాన్‌ జయంతి సందర్భంగా తమకు ఈ వార్త ఎంతో ఆనందం కలిగించిందని ప్రకటించింది. ఎయిమ్స్‌ వైద్యుల సూచన మేరకు కేజ్రీవాల్‌కు లో-డోస్‌ ఇన్సులిన్‌ రెండు యూనిట్లు ఇచ్చినట్టు తీహార్‌ జైలు అధికారులు వెల్లడించారు.

Spread the love