మాడు మండుతోంది

The cow is burning– మళ్లీ 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
– కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మళ్లీ 45 డిగ్రీలు దాటాయి. నల్లగొండ జిల్లా టీక్యాతండాలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. ఉక్కపోత తీవ్రత కూడా పెరిగింది. బుధ, గురువారాల్లో పలు చోట్ల పగటి పూట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందనీ, పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగాల్పులు వీచే సూచనలున్న జాబితాలో నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాలున్నాయి. వచ్చే వారం రోజుల్లో వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే ప్రమాదముంది. బుధవారం నాడు అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశాలున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, ఖమ్మం, నారాయణపేట, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ఒకటెండ్రు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. జీహెచ్‌ఎమ్‌సీ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముంది.
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు
టీక్యాతండా (నల్లగొండ) 45.1 డిగ్రీలు
భద్రాచలం(భద్రాద్రి కొత్తగూడెం) 44.9 డిగ్రీలు
ములుగు 44.5 డిగ్రీలు
వేములపల్లి(నల్లగొండ) 44.5 డిగ్రీలు
తిమ్మాపూర్‌(నల్లగొండ) 44.4 డిగ్రీలు

Spread the love