రాహుల్‌ వ్యాఖ్యలను ఖండించిన బృందాకరత్‌

న్యూఢిల్లీ :  కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రకటనను ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం)  పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌ కోరారు. ఈ అంశంలో కాంగ్రెస్‌ అధిష్టానం జోక్యం చేసుకోవాలని సూచించారు. రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు అనైతికం, దిగ్భ్రాంతికరం, సిగ్గుచేటని అన్నారు. శుక్రవారం కొచ్చిలో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న విజయన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించడం కాంగ్రెస్‌ నేతకు తగదని అన్నారు. ముఖ్యంగా ప్రతిపక్షనేతలు లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇడి, ఆదాయపన్ను శాఖ (ఐటి), సిబిఐ దాడులు చేస్తున్న సమయంలో రాహుల్‌ వ్యాఖ్యలు ఆక్షేపణీయమని ఆమె అన్నారు. దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులను (కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌) ఇడి అరెస్ట్‌ చేయడాన్ని గతంలో సిపిఎం ఖండించిందని బృందాకరత్‌ పేర్కొన్నారు. అలాగే పార్లమెంట్‌ నుండి రాహుల్‌ గాంధీని బహిష్కరించడం, కాంగ్రెస్‌ ఖాతాలను ఫ్రీజ్‌ చేయడం, గాంధీ కుటుంబం మొత్తాన్ని అవినీతిపరులను చేసే యత్నాలను సిపిఎం తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తు చేశారు. గాంధీ కుటుంబసభ్యులను అరెస్ట్‌ చేయాలని సీపీఐ(ఎం) ఎప్పుడూ డిమాండ్‌ చేయలేదని స్పష్టం చేశారు. సిపిఎం సూత్రప్రాయమైన నిబంధనలకు కట్టుబడి, స్థిరమైన వైఖరిని అవలంబించిందని ఆమె అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ల అరెస్టును ఇండియా కూటమి సంయుక్తంగా ఖండించిందన్నారు. ఇండియా కూటమి నేత అయిన రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు ఆందోళనకరమని అన్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్‌ అధిష్టానం పరిశీలించాలని ఆమె కోరారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసేందుకు మోడీ ప్రభుత్వం అన్ని అధికారాలను వినియోగిస్తోందని మండిపడ్డారు.   రాజ్యాంగ విలువలను కాపాడేందుకు, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల నుండి దేశాన్ని కాపాడేందుకు సిపిఎం ఇండియా కూటమిలో చేరాలని నిర్ణయించుకుందని అన్నారు. విచారణ జరుగుతున్న సమయంలో విజయన్‌ కుమార్తె వీణ అంశంపై రాహుల్‌ వ్యాఖ్యానించడం సరికాదని బృందాకరత్‌ పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రజల కోసం పార్లమెంటులో తమ గళాన్ని వినిపించడంలో యుడిఎఫ్‌ ఎంపిలు విఫలమయ్యారని మండిపడ్డారు.

Spread the love