బీఆర్‌ఎస్‌వి అవకాశవాద రాజకీయాలు

– అగష్టు 15 లోపు రైతు రుణమాఫీ అమలు
– యువకులు స్వయంఉపాధి రంగాల్లో రాణించాలి
– కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి
నవతెలంగాణ-ఆమనగల్‌
తెలంగాణ సెంటిమెంట్‌తో బీఆర్‌ఎస్‌ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతుందని కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరోపించారు. రాజకీయంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడల్లా ఆపార్టీ నాయ కులకు తెలంగాణ సెంటిమెంట్‌, అమరవీల స్థూపం గుర్తుకొస్తుందని ఎద్దెవా చేశారు. అధికారానికి దూరమైన గులాబీ పార్టీ నాయకులు జీర్ణించుకోలేక అధికార పార్టీపై కుట్రలకు తెరలేపుతూ తమ ఉనికిని చాటుకోవడానికి అసత్య ప్రచారాలు సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కడ్తాల్‌ మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా మైసిగండి గ్రామంలో యువకులు పవన్‌, ప్రవీణ్‌ స్థాపించిన స్వయం ఉపాధి కేంద్రాన్ని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీపీ కమ్లి మోత్యానాయక్‌, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీక్యానాయక్‌ తదితరులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పలు గ్రామాల్లో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాటా ్లడుతూ వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ ను ఆదరించి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నందున కేంద్రంలో కూడా అదే ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రైతుల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేపడ తామని ముఖ్యమంత్రి స్వయంగా తెలిపిన బీఆర్‌ ఎస్‌ నాయకులు, మాజీ మంత్రి హరీశ్‌రావు రాజ కీయం చేయడం సిగ్గుచేటు అన్నారు. కేంద్రంలోని బీజేపీ మతతత్వ రాజకీయాలతో దేశంలో అశాంతిని సృష్టించేందుకు కుట్రలు సాగిస్తుందని ఆయన విమర్శించారు. మోడీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ పదేండ్ల పాలనలో అమలుకు నోచు కోలేదన్నారు. బీజేపీ సర్కారు పేదల సంక్షేమాన్ని విస్మరించి, సంపన్నుల కొమ్ము కాస్తుందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్‌ తోనే అన్నివర్గాలకు మేలు జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌ విండో డైరెక్టర్‌ చేగురి వెంకటేష్‌, నాయకులు జవాహార్‌లాల్‌ నాయక్‌, రాంచందర్‌ నాయక్‌, కిషన్‌ నాయక్‌, తులసిరాంనాయక్‌, ప్రవీణ్‌, శివ పాల్గొన్నారు.

Spread the love