యూపీలో మీడియాపై ‘బుల్‌డోజర్‌’

– వ్యతిరేక వార్తలు కనిపిస్తే నోటీసులు
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛపైనా ‘బుల్‌డోజర్‌’ను ప్రయోగిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించే లేదా ప్రసారం చేసే సంస్థలపై నిఘా పెట్టింది. ఇలాంటి వార్తలు అందిస్తే వివరణ ఇవ్వాలంటూ ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేస్తారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే మీడియా సంస్థలపై ఓ కన్నేసి ఉంచాలంటూ యోగి ప్రభుత్వం తాజాగా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజరు ప్రసాద్‌ డివిజనల్‌ కమిషనర్లు, జిల్లా మెజిస్ట్రేట్లకు లేఖలు రాశారు. వీటి ప్రకారం వార్తా పత్రికలలో, మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే వార్తలను సమాచార శాఖ అధికారులు సేకరిస్తారు. అలాంటి వార్తలలో వాస్తవాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని నిర్ధారించుకుంటారు. ఆ తర్వాత వివరణ కోరుతూ సంబంధిత సంస్థల మేనేజర్లకు నోటీసులు జారీ చేస్తారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మీడియా గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అర్థమవుతోంది. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపి, నిర్మొహమాటంగా, నిస్పాక్షికంగా వార్తలు రాసే పాత్రికేయులపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని సీనియర్‌ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవాలు నిర్ధారించుకోకుండా సామాజిక మాధ్యమాలలో తప్పుడు వార్తలు వ్యాప్తి చెందుతున్నప్పటికీ వాటిపై నియంత్రణ లేకుండా పోతోందని పలువురు సంపాదకులు గుర్తు చేశారు. కొన్ని సందర్భాలలో గ్రామీణ ప్రాంతాల విలేకరులకు అధికారులు అవసరమైన సమాచారం, వివరణ ఇవ్వడం లేదని, దీంతో వారు ఏకపక్షంగా వార్తలు అందించాల్సి వస్తోందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక మాజీ సీనియర్‌ ఎడిటర్‌ అతుల్‌ చంద్ర చెప్పారు. అధికారుల వివరణలు లేకుండా వార్తలు రాస్తే అవి ఏకపక్షంగా ఉన్నాయని చెబుతూ విలేకరులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వార్తలు, రాజకీయ వార్తలు రాసే పాత్రికేయుల కష్టాలు మరింతగా పెరుగుతాయని యూపీ అక్రెడిటెడ్‌ జర్నలిస్ట్స్‌ కమిటీ మాజీ సభ్యుడు నవేద్‌ షికో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ఇలాంటి ఆంక్షలు ఆమోదయోగ్యం కావని కమిటీ అధ్యక్షుడు హేమంత్‌ తివారీ చెప్పారు. ఈ విషయంపై తాము ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. మీడియా స్వతంత్రతను, నిస్పాక్షికతను ప్రభుత్వం అడ్డుకుంటోందని కాంగ్రెస్‌ నాయకుడు సంజరు సింగ్‌ అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండీ మీడియాపై పెత్తనం చెలాయిస్తోందని ఆయన విమర్శించారు.

Spread the love