కర్ణాటకలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జూన్‌ 30న ఉప ఎన్నిక

నవతెలంగాణ – కర్ణాటక: ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. గతంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన బాబూరావు చించన్‌సూర్‌ (2024 జూన్‌ 17 వరకు పదవీకాలం ఉంది), ఆర్‌.శంకర్‌ (జూన్‌ 30, 2026వరకు), సవాడి లక్ష్మణ్‌ (జూన్‌ 14, 2028 వరకు) ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచారు. దీంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న ఆ మూడు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా జూన్‌ 13న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు తెలిపింది. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు జూన్‌ 20 కాగా.. 21న నామినేషన్లు పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువును జూన్‌ 23గా నిర్ణయించారు. జూన్‌ 30న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.

Spread the love