నవతెలంగాణ – న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ గత కొన్నాళ్లుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. అయినా కేంద్ర సర్కారు రెజ్లర్ల గోడు పట్టించుకోకుండా పెడచెవిన పెడుతూ వస్తున్నది. ఈ క్రమంలో ఇవాళే ప్రారంభమైన నూతన పార్లమెంట్ భవనం ముందు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలకు డిమాండ్ చేస్తూ మహిళా మహాపంచాయత్ నిర్వహించాలని రెజ్లర్లు నిర్ణయించారు. ఈ మేరకు నూతన పార్లమెంట్ భవనం వైపు ర్యాలీగా వెళ్తున్న రెజ్లర్లను పోలీసులు జంతర్‌మంతర్ వద్ద అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆందోళనలో పాల్గొన్న పలువురు రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్, మరో రెజ్లర్ బజరంగ్ పూనియా ఉన్నారు. కాగా, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని రెజ్లర్లు మండిపడుతున్నారు. ఇంకేమైనా హద్దులు మీరామా..? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
https://twitter.com/i/status/1662707784142708737