2013 భూ సేకరణ చట్ట ప్రకారమే నష్ట పరిహారం చెల్లించాలి

– ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకుంటాం
– సాగునీటి పథకాల వల్ల జిల్లాకు తీవ్ర నష్టం
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-మణుగూరు
జూన్‌ 14న సీతమ్మ సాగర్‌ ప్రాజెక్ట్‌ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రాజెక్టు ప్రభావిత నిర్వాసితులకు మార్కెట్‌ ధరలకు అనుగుణంగా 2013 చట్టాన్ని అనుసరించి నష్టపరిహారం చెల్లించాలని, అధికార పార్టీ మంద బలంతో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తే అడ్డుకుంటామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య హెచ్చరించారు. మంగళవారం పీవీ కాలనీలో ముఖ్య కార్యకర్తల సమావేశం సీనియర్‌ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర ప్రాజెక్టు భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌, సింగరేణి, రైల్వే లైన్‌ నిర్మాణాల వలన నిర్వాసితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో బొగ్గును ఉపయోగించి విద్యుత్‌ తయారు చేయించి ప్రపంచానికి వెలుగనిస్తున్న బీటీపీఎస్‌ భూనిర్వస్తులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. బీటీపీఎస్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మెను విరిమింపజేయాలని డిమాండ్‌ చేశారు. సీతారామ, సీతమ్మ ప్రాజెక్టుల కారణంగా జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. జిల్లాలో భారీ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పటికీ జిల్లాలోని భూములకు నీరందే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు రైతులకు జరుగుతున్న అన్యాయంపై నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. భద్రాచలం, ఇల్లందు, పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి అన్నారు. ఈ సమావేశంలో లెనిన్‌ బాబు, సత్రపల్లి సాంబశివరావు, టీవీ ఎం.వి ప్రసాద్‌, నందం ఈశ్వరరావు, మాచారపు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love