బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌

 బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌– కడియం శ్రీహరిది నమ్మకద్రోహం
– బీజేపీని ఎదుర్కొనే దమ్ము కేసీఆర్‌కే ఉంది : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ – కాశిబుగ్గ
రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం వరంగల్‌ తూర్పు నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ అధ్యక్షతన ఉర్సుగుట్ట నాని గార్డెన్‌లో నిర్వహించగా, కేటీఆర్‌ హాజరై మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో కడియం శ్రీహరికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఉప ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ అవకాశం కల్పించారని, కానీ ఆయన నమ్మకద్రోహం చేసి వ్యక్తిగత లబ్దికోసం పార్టీని వీడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలైన రెండు లక్షల రుణమాఫీ, రైతుబంధు, మహిళలకు రూ. 2500 పెన్షన్‌, కౌలు రైతులకు రైతుబంధు లాంటి ఎన్నో హామీలు ఇంతవరకు అమలు చేయలేదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్‌ను నమ్మి ఓటు వేయొద్దన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తూ ప్రజల్ని రెచ్చగొడుతుందని విమర్శించారు. రాముడు అందరికీ దేవుడేనని, ఒక్క బీజేపీ సొత్తుకాదని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి 10 నుంచి 12 స్థానాలను ప్రజలు ఇస్తే రాష్ట్ర రాజకీయాలను మారుస్తామన్నారు. ఆరూరి రమేష్‌ రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే తన స్వార్థం కోసం పార్టీని వీడి బీజేపీలో చేరారని తెలిపారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులను చిత్తుగా ఓడించి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీని ఎదుర్కొనే దమ్ము ధైర్యం కాంగ్రెస్‌కు లేదని, అది క్క బీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌కు మాత్రమే ఉందన్నారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మెన్‌ బండ ప్రకాష్‌, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, తాడికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, బస్వరాజు సారయ్య, వరంగల్‌ జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ గండ్ర జ్యోతి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, దాస్యం వినరు భాస్కర్‌, పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

Spread the love