పార్లమెంట్‌లో కార్మిక గొంతు ఎలమారం కరీం

పార్లమెంట్‌లో కార్మిక గొంతు ఎలమారం కరీంజె.జగదీష్‌, నవతెలంగాణ
కేరళలో కోజికోడ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి సీపీఐ(ఎం) తరపున పోటీ చేస్తున్న ఎలమారం కరీం తన రాజకీయ జీవితాన్ని కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలతో ప్రారంభించారు. ఆయన గొప్ప పార్లమెంటేరియన్‌. పార్లమెంట్‌లో కార్మిక గొంతుగా నిలిచిన ఎలమారం కరీం, ఇప్పుడు లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. శ్రామిక వర్గ రాజకీయాల సూక్ష్మబేధాలను ప్రజలకు తెలియజేసే అద్భుతమైన వక్తృత్వ శైలి ఉన్న కరీం, దేశంలోనే పేరున్న ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడుగా ఉన్నారు.
ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న ఎలమారం పార్లమెంట్‌లో లౌకిక భారతదేశానికి బలమైన గొంతుక. సీపీఐ(ఎం) రాజ్యసభ నాయకుడుగా కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు, ఫాసిస్టు చర్యలను వ్యతిరేకించినందుకు ఆయనను రెండుసార్లు పార్లమెంట్‌ నుంచి సస్పెండ్‌ చేశారు. సభలో ప్రతిపక్ష పార్టీలను సమన్వయం చేస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హౌదా, వ్యవసాయ చట్టాలు, కార్మిక చట్ట సవరణ, త్రిపుల్‌ తలాక్‌ను తొలగించే బిల్లుపై ఆయన సభలో చేసిన ప్రసంగాలు జాతీయ దృష్టిని ఆకర్షించాయి.
రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎలమారం 2006లో విఎస్‌ అచ్యుతానంద మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల బాట పట్టించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో కొత్తగా ఏడు పారిశ్రామిక ప్రాజెక్టులు ప్రారంభించారు.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కేరళ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (కేఎస్‌ఎఫ్‌)తో ప్రజా క్షేత్రంలోకి వచ్చిన ఆయన, రాష్ట్రంలో ప్రయివేట్‌ మోటారు రవాణా రంగంలోని సమస్యలను లేవనెత్తుతూ అనేక ఆందోళనలు నిర్వహించారు. మోటారు కార్మికుల సంఘాల ఐక్య వేదిక ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు. మోటార్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మోటారు వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డులో సభ్యుడయ్యారు. 1996లో కోజికోడ్‌ రెండో నియోజకవర్గం నుంచి, 2006, 2011లో బేపూర్‌ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2006లో పరిశ్రమల శాఖ మంత్రిగా జెనీవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌ఓ) సదస్సులో పాల్గొన్నారు. ఆయన లేబర్‌, టెక్స్‌టైల్స్‌ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు. పార్లమెంటులో భారీ పరిశ్రమల కన్సల్టెన్సీ కమిటీ సభ్యుడుగా ఉన్నారు. కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీ సమీపంలోని కోవూరులో నివసిస్తున్నారు. ఆయనకు భార్య రహమత్‌, పిల్లలు పికె సుమి, పికె నిమ్మి ఉన్నారు.మరోసారి పార్లమెంట్‌లో ప్రజాసమస్యలను లేవనెత్తే అవకాశాన్ని ఇవ్వాలని ఎలమారం కరీం అభ్యర్థిస్తున్నారు.

Spread the love