సీఐటీయూ కృషితో రూ.80లక్షల పరిహారం
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
అంగీకరించిన పరిశ్రమ యాజమాన్యం
నవతెలంగాణ-గుమ్మడిదల
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని మైత్రి డ్రగ్స్ పరిశ్రమలో 10 రోజుల క్రితం ప్రవీణ్ కుమార్ (25) అనే కార్మికుడు సెకండ్ షిఫ్ట్‌లో పనిచేస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే సూరారంలోని మల్లారెడ్డి హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించారు. నిమ్స్‌లో 8 రోజుల పాటు చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం నాలుగు గంటలకు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రాజయ్య నిమ్స్ ఆస్పత్రికి చేరుకొని మృతుని భౌతికకాయాన్ని సందర్శించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి యాజ మాన్యంతో చర్చలు జరిపారు. యాజమాన్యం సానుకూలంగా స్పందించి మృతుడు ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులకు రూ.80 లక్షల పరిహారం ఇచ్చేందుకు అంగీకరించారు. దాంతోపాటు కుటుంబంలో ఒకరికి పరిశ్రమ లో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముందుగా యాజమాన్యం అంత్యక్రియల కోసం సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో లక్ష రూపాయలను అందజేశారు. రూ.80 లక్షల పరిహారం పదిరోజుల్లో అందజేస్తామని కుటుంబ సభ్యులకు రాతపూర్వకంగా రాసి ఇచ్చారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. పరిశ్రమ యజమాన్యంతో చర్చలు జరిపామని, యాజమాన్యం సానుకూలంగా స్పందించి నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించిందన్నారు. ఈ చర్చల్లో పరిశ్రమ తరపున ఎన్.శ్రీనివాస్ రావు, రాంప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.



