కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష ప్రభుత్వాలపై దాడి : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఖమ్మం జిల్లా ఏదులాపురంలో పాలేరు బీఎల్ఏల శిక్షణా శిబిరం
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రతిపక్ష పార్టీలను, ప్రతిపక్ష ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ ప్రజాస్వామ్య విరుద్ధమైన కుట్రలకు తెరలేపిందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ పాలితా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అప్రజాస్వామిక పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట క్రాస్ రోడ్డులో ఉన్న పీవీఆర్ గార్డెన్స్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) శిక్షణా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చట్టం రూపంలో తీసుకొచ్చిన ఎస్‌ఐఆర్ ఒక పెద్ద భూతం లాంటిదని, ఇది ముమ్మాటికీ దొంగదారి చర్యేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో, ఎక్కడైతే మనకు ఓట్లు ఎక్కువగా ఉన్నాయో.. అక్కడ ఒక పద్ధతి ప్రకారం దాదాపు 30 నుంచి 35 శాతం ఓట్లను ఫేక్ ఓట్లుగా చిత్రీకరించి, వాటిని జాబితా నుంచి తొలగించేందుకు కేంద్రం పెద్ద కుట్ర చేస్తోందన్నారు. ఓటరు వయసులో స్వల్ప తేడాలున్నా, పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా.. వాటన్నింటినీ వంకగా చూపి ఓట్లను లేపేసే ప్రమాదం ఉందని తెలిపారు. ఇప్పటికే బీహార్, వెస్ట్ బెంగాల్‌లో ఈ పద్ధతిని ప్రయోగించి సక్సెస్ అయ్యారన్నారు. అదే ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలోనూ ప్రయోగించాలని చూస్తున్నారని, దీన్ని కాంగ్రెస్ సైనికులు గట్టిగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
నిన్న ఓట్లు.. నేడు సీట్లే దొంగిలిస్తున్నారు
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఉదంతాన్ని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా ప్రస్తావించారు. మీనాక్షి నటరాజన్‌కి కావలసిన ఓట్ల కంటే 11 ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, అయినప్పటికీ కేవలం ఒక పాత ఎఫ్‌ఐఆర్ కాగితాన్ని సాకుగా చూపి, ఎన్నికల అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అక్రమంగా ఆమె నామినేషన్‌ను తిరస్కరింపజేశారన్నారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సిన ఒక రాజ్యసభ స్థానాన్ని వాళ్ళు దొంగిలించారన్నారు. నిన్నటి వరకు ఓట్లను దొంగిలించిన వాళ్ళు.. ఈరోజు ఏకంగా సీట్లనే దొంగిలించే దుస్థితికి కేంద్ర ప్రభుత్వం దిగజారిందిని ఆరోపించారు.
ప్రతి ఓటూ కాంక్రీట్ గోడ కావాలి..
జూన్ 25 నుంచి జులై 24 వరకు నెల రోజుల పాటు బూత్ లెవెల్ అధికారులు నిర్వహించే ‘ఓట్ మ్యాపింగ్’ ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. “ఉద్యోగాలు, చదువుల రీత్యా.. ఖమ్మం, హైదరాబాద్‌లో ఉండే మన వాళ్ళు అధికారులు వచ్చినప్పుడు ఊర్లో లేరనే సాకుతో ఓట్లు తొలగించే ప్రమాదం ఉందన్నారు. అధికారులు వచ్చే ముందే గ్రామంలో చాటింపు వేయించి వేరే ఊర్లలో ఉన్న మన ఓటర్లను రప్పించి ఓటు కాపాడుకోవాలని తెలిపారు. మనకు దొంగ ఓట్లు అవసరం లేదని, మనకున్న జనాదరణతో ప్రతి ఓటునూ ఒక కాంక్రీట్ గోడ లాగా కాపాడుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, పీసీసీ ప్రతినిధి సుధాకర్, ఏదులాపురం మున్సిపల్ చైర్మెన్ అనిత, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మెన్లు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఎల్ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



